ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా..నేడు ప్రమాణ స్వీకారం..
ప్రమాణ స్వీకారోత్సవంలో రేఖాగుప్తాతో పాటు పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రాజ్ ప్రమాణం చేయనున్నారు.;
ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో సీఎం ఎంపికలో బీజేపీ (BJP) అధిష్టానం ఆచితూచి వ్యవహరించింది. చివరకు రేఖాగుప్తా(Rekha Gupta) పేరును ఖరారు చేసింది. ఈమె శాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఆప్ (AAP) అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్‌ఖడ్‌ల సమక్షంలో 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ(Parvesh Verma), విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు.
మహిళలకే ప్రాధాన్యం..
ఇదివరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ ఉన్నారు. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా రేఖాగుప్తా నిలవనున్నారు. ఇటు ముఖ్యమంత్రి పదవిపై మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ ఆశలు పెట్టుకున్నారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌ను ఓడించడం, రాజకీయ వారసత్వం కూడా ఉండడం వల్ల పర్వేష్ సీఎం అవుతారని చాలామంది భావించారు. కాని అనూహ్యంగా మహిళ పేరును అధిష్టానం ఖరారు చేసింది.
రామలీలా మైదానంలో ప్రమాణస్వీకారోత్సవం..
రేఖా గుప్తా, ఆమె మంత్రివర్గ సభ్యులు గురువారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం ఢిల్లీలోని రామలీలా మైదానంలో ప్రధాని మోదీ (PM Modi), ఎన్డీఏ నేతల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కే. సక్సేనా వారితో ప్రమాణం చేయిస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతలు వెంట రాగా గవర్నర్‌ను కలిశారు. దీంతో ఆయన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రేఖా గుప్తాను ఆహ్వానించారు. గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులు పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రాజ్ కూడా ప్రమాణం చేయనున్నారు.