తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలు...వరదలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో హన్మకొండ, ఖమ్మం, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
నీటిలో తేలియాడుతున్న మూడు ప్రాంతాలు
వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు వరదనీటిలో తేలియాడుతున్నాయి. సోమిడి చెరువు, వడ్డెపల్లి చెరువు, ఊర చెరువు నిండిపోయాయి. ఊరచెరువుకు పడిన గండితో వరంద ీనరు మూడు ప్రాంతాలను ముంచెత్తింది. 118 కాలనీలు నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతినగర్, హంటర్ రోడ్డు నీట మునిగాయి. హైదరాబాద్- వరంగల్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచాయి. స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతంలోనూ వరదనీరు పొంగి ప్రవహిస్తుంది. మొంథా తుపాన్ వల్ల భారీవర్షం వరంగల్ జిల్లాల్లో కురవడంతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలతో డిండి ప్రాజెక్టులోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. శ్రీశైలం- హైదరాబాద్ మార్గంలో వరదనీటి ధాటికి తెగిపోయింది. ఈ రోడ్డు దెబ్బతినడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.
వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యాన్
మొంథాతుపాను ప్రభావంతో భారీ వర్షాలకు కొణిజర్ల మండలంలో పడిగేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగులో వ్యాన్ కొట్టుకుపోయింది. తుమ్మలపల్లి గ్రామం రహదారిపై ఉధృతితో ప్రవహిస్తున్న వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఖమ్మం జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి సంసిద్ధతతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాకలెక్టరేట్ కార్యాలయంలో సహాయానికి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్1077, వాట్సాప్ సెల్ నెంబర్ 9063211298 లను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు.
రోడ్లను ముంచెత్తిన వరదనీరు
రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.ఖమ్మంరూరల్ మండలంలోని జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ తదితర మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. మొంథా తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు మున్నేరు వరద ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు అనవసరంగా ముంపు ప్రాంతాల్లో తిరగవద్దని ఆయన సూచించారు. ఎగువ నుండి వచ్చే వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున #ఖమ్మం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి సంసిద్ధతతో స్థానికంగా ఉంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఖమ్మం నగరంలోని కాల్వొఒడ్డు, మున్నేరు ఘాట్, గణేష్ నిమర్జన ఘాట్, బొక్కలగడ్డ తదితర ప్రాంతాలలో మున్సిపల్ కమీషన్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి పర్యటించారు. ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు17అడుగుల మేర ప్రవహిస్తోందని మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇల్లు వదిలి బయటకు రావద్దు
మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దని కోరారు. ట్రాన్స్ ఫార్మర్లు,విద్యుత్ స్తంభాలు,విద్యుత్ వైర్ల చెంతకు వెళ్లవద్దని సూచించారు. వర్షాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబరు 18004251442 కు సంప్రదించవచ్చునన్నారు.కాజీపేట్‌లోని శ్రీ వెంకటేశ్వర హోం నుంచి 152 మంది పిల్లలను వరద ప్రవాహం కారణంగా మడికొండ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్ స్టిట్యూషన్‌కు తరలించామని కలెక్టర్ చెప్పారు. మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
కొండపర్తి వద్ద కాలువ గండిని నివారించిన అధికారులు
హనుమకొండ జిల్లా యంత్రాంగం త్వరిత చర్యలు తీసుకొని ఇనవోలు మండలం కొండపర్తి వద్ద కాలువ తెగిపోవడాన్ని సమర్థవంతంగా ఆపారు. ధర్మసాగర్‌లోని ముప్పారం ట్యాంక్ నుండి భారీ వరదను విజయవంతంగా మళ్లించారు.
రైలు ప్రయాణికులు ఆహారం,నీరు పంపిణీ
మహబుబాబాద్ రైల్వే స్టేషన్‌లో వరదనీటితో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఎన్జీఓలు,స్థానిక పోలీసులు సకాలంలో సహాయాన్ని అందించారు. రైల్వేలతో సమన్వయంతో దారి మళ్లించిన రైలు నంబర్ 17406 కృష్ణా ఎక్స్‌ప్రెస్, 11019 కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లలో చిక్కుకున్న ప్రయాణీకులకు ఆహారం,తాగునీరు అందించారు.
కరీంనగర్ జిల్లాలో...
కరీంనగర్ జిల్లాలో గురువారం పాఠశాలలను మూసివేశారు. రాబోయే రెండు రోజుల్లో మొంథా తుపాను ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందుజాగ్రత్త చర్యగా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సైదాపూర్ మండలంలో వాగులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి.అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప పౌరులు ఇంటి లోపలే ఉండాలని, కల్వర్టులను దాటకుండా లేదా నీటి వనరులలోకి ప్రవేశించకుండా ఉండాలని కోరారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల దృష్ట్యా అక్టోబర్ 30 గురువారం న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలపై నిరంతర నిఘా పెట్టామని చెప్పారు.ప్రమాద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు
చేశామని చెప్పారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, వాగులు–వంతెనలు దాటవద్దని కోరారు. వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది అని కలెక్టర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో ...
మొంథా తీవ్ర తుపానుతో గ్రేటర్ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లక్డికపూల్ పరిసర ప్రాంతాలను బుధవారం హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్ వీ కర్ణన్ లు సంయుక్తంగా పరిశీలించారు.మాసబ్ ట్యాంకు నుంచి లక్డికపూల్ వైపు వస్తున్నప్పుడు మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఇరువురు కమిషనర్లు అధికారులను ఆదేశించారు.