వచ్చే వారం ఆల్ ఇండియా SIR తొలి దశ ప్రారంభం..
దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణను ప్రారంభించనున్న ఎన్నికల సంఘం..
ఎన్నికల కమిషన్ (EC) వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(SIR) ను చేపట్టబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని EC అధికారులు శనివారం (అక్టోబర్ 25) తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆలస్యంగా నిర్వహిస్తారు.
15 రాష్ట్రాల్లో..
అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో మొదటి దశలో SIR చేపట్టే అవకాశం ఉంది. గ్రామస్థాయి ఎన్నికల యంత్రాంగం పంచాయతీ ఎన్నికలతో బిజీగా ఉన్నందున..స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగనున్న రాష్ట్రాల్లో EC ఈ కార్యక్రమాన్ని నిర్వహించదు. ఇలాంటి రాష్ట్రాల్లో SIR తరువాత నిర్వహిస్తారు.
బీహార్‌లో S.I.R ముగిసింది. సెప్టెంబర్ 30న దాదాపు 7.42 కోట్ల పేర్లతో తుది జాబితాను రిలీజ్ కూడా చేశారు. బీహార్‌లో నవంబర్ 6 , 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.