హైదరాబాద్ వన్యప్రాణులను దత్తత తీసుకున్న అమెరికన్ కంపెనీ
అమెరికన్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్లూ యోండర్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా హైదరాబాద్ జూపార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకుంది.
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో పలు వన్యప్రాణులను యునైటెడ్ వే హైదరాబాద్ సహకారంతో అమెరికన్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్లూ యోండర్ దత్తత తీసుకుంది. జూ పార్కులోని ఆసియా సింహాలు, రాయల్ బెంగాల్ టైగర్స్, పాంథర్స్ ను కంపెనీ దత్తత తీసుకుంది.
శనివారం హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఒక జత ఆసియాటిక్ లయన్స్, ఒక జత రాయల్ బెంగాల్ టైగర్స్, ఒక పాంథర్, ఒక లయన్-టెయిల్డ్ మకాక్,ఇతర జంతువులను బ్లూ యోండర్ కంపెనీ దత్తత తీసుకుంది.
దత్తత ప్రక్రియను అధికారికంగా ఆమోదించడానికి శనివారం బ్లూ యోండర్ , యునైటెడ్ వే హైదరాబాద్ ప్రతినిధులు జూను సందర్శించారు.
జూపార్కులోని ఎన్‌క్లోజర్ల నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలు, వన్యప్రాణులకు అందించే ఆహారం నాణ్యతను పరిశీలించి జూపార్కు అధికారులను అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణకు మద్దతుగా ముందుకు వచ్చినందుకు తెలంగాణ జూ పార్క్స్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్, క్యూరేటర్ జె వసంత బ్లూ యోండర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జూ జంతువుల దత్తత కార్యక్రమంలో పాల్గొని భారతదేశం యొక్క గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటానికి దోహదపడాలని జూ అధికారులు కార్పొరేట్, సాంకేతిక సంస్థలను కోరారు.