అశ్విని వైష్ణవ్‌ ‘పార్ట్‌టైమ్‌ రైల్వే మంత్రి’..

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై టీఎంసీ ఎంపీలు స్పందించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.;

Update: 2025-02-16 11:37 GMT
Sagarika Ghose
Click the Play button to listen to article

న్యూఢిల్లీ(New Delhi) రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట(Stampede)ను దాచిపెట్టేందుకు కేంద్రం ప్రయత్నించిందని టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్(Sagarika Ghose) ఆరోపించారు. ఈ ఘటనకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ బాధ్యత వహించి పదవికి రాజీనాయా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.


"ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు"

"కేంద్ర ప్రభుత్వం భారతీయుల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన వర్ణించలేని విషాదం," అని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఒక్కోసారి ఒక్కోమాట..

"తొక్కిసలాట జరిగిందనే విషయాన్ని మొదట నరేంద్ర మోదీ(PM Modi), బీజేపీ(BJP) కొట్టిపారేశారు. అది పుకారు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఆపై ‘కొంత మంది గాయపడ్డారని’ అంగీకరించారు. చివరికి ‘కొంత మంది చనిపోయి ఉండొచ్చని చెప్పారు," అని ఘోష్ మండిపడ్డారు. "బీజేపీది ‘కనీస పాలన, గరిష్ఠ ప్రచారం. మరణాల గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెబుతారు? మోదీ ప్రభుత్వ ముసుగును తొలగించిన ఘటన ఇది," అని ఆమె వ్యాఖ్యానించారు.

‘క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’

మరో టీఎంసీ(TMC) రాజ్యసభ సభ్యుడు సాకేత్‌ గోఖలే (Saket Gokhale) కూడా ఇదే ధోరణిలో స్పందించారు. "తొక్కిసలాటలో 17 మంది మరణించడం, అనేక మంది గాయపడడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా," అని పేర్కొన్నారు. అయితే "తొక్కిసలాట జరిగిన తర్వాత కొన్ని గంటల వరకు రైల్వే శాఖ ఈ ఘటనను పుకారు అని కొట్టిపారేసింది. ఇది స్పష్టంగా కప్పిపుచ్చే ప్రయత్నం. చివరికి మృతదేహాలు బయటపడటంతో నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది," అని గోఖలే ఆరోపించారు.

‘అశ్విని.. పార్ట్‌టైమ్‌ రైల్వే మంత్రి’

"మోదీ ప్రభుత్వం నియమించిన ‘పార్ట్‌టైమ్‌ రైల్వే మంత్రి’ అశ్విని వైష్ణవ్‌’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "వైష్ణవ్‌కు బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. ప్రధాని మోదీ ప్రజల ప్రాణాలకు విలువనిస్తే వెంటనే ఆయనను బహిష్కరించాలి," అని గోఖలే డిమాండ్‌ చేశారు. "భారతీయుల ప్రాణాలను అంత తేలిగ్గా తీసిపారేయలేం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టరాదు," అని ఆయన పేర్కొన్నారు.


ఏర్పాట్లలో విఫలం..

సాకేత్‌ గోఖలే "ఇది కుంభమేళాకు సంబంధించిన రెండో తొక్కిసలాట" అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కుంభమేళాను ప్రజాసంబంధాల కార్యక్రమంగా మలిచిందని విమర్శించారు. "ప్రతి రోజు ప్రయాగరాజ్‌కు వేలాది మంది యాత్రికులు అధిక సంఖ్యలో వెళ్లుతున్నట్లు చిత్రాలు, వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, మోదీ, యోగి ప్రభుత్వాలు ప్రయాణీకుల భద్రత కోసం సరైన ఏర్పాట్లు చేయలేదు," అని ఆయన ఆరోపించారు. "మిలియన్ల మంది ప్రజలను ప్రయాగరాజ్‌కు వెళ్లేలా ఉత్సాహపరిచారు. కానీ, వారి కోసం తగిన ఏర్పాట్లు చేయలేదు," అని వ్యాఖ్యానించారు.

భద్రతా చర్యలు శూన్యం..

"భారతీయ రైల్వేల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. కానీ రైల్వే మంత్రి వీడియో రీల్స్ షేర్‌ చేయడమే తప్ప భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాడు," అని గోఖలే తీవ్రంగా విమర్శించారు. శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మృతి చెందారు, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.


Tags:    

Similar News