ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఎల్‌కే అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు, 96 సంవత్సరాల ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Update: 2024-06-27 07:55 GMT

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరీక్షించిన వైద్యులు కొన్ని రకాల పరీక్షలు నిర్వహించి యూరాలజీ విభాగానికి షిప్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం ఆయన వయసు 96 సంవత్సరాలు. బీజేపీ కురువృద్ధుడి ఆరోగ్యస్థితిపై హెల్త్ బులిటన్ విడుదల కావాల్సి ఉంది.

మూడు నెలల క్రితం అద్వానీ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ఆయనకు అందజేశారు. లాంఛనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఎల్‌కే అద్వానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఎల్‌కె అద్వానీ జూన్ 2002 నుంచి మే 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా, అక్టోబర్ 1999 నుంచి మే 2004 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 1986 నుంచి 1990, 1993 నుంచి 1998, 2004 నుంచి 2005 మధ్య కాలంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

అద్వానీ, అనేక మంది జనసంఘ్ సభ్యులు 1980లో జనతా పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని స్థాపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి పార్టీకి తొలి అధ్యక్షుడు. అద్వానీ తన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 1989లో న్యూఢిల్లీ నుంచి పోటీ చేశారు. అయోధ్యలోని రామమందిరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ రథయాత్ర ప్రారంభించారు.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆ తర్వాత తనపై, మహ్మద్ అలీ జిన్నాపై చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తడంతో ఆయన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఆయన తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారంలోకి వచ్చారు.

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యాడు.

Tags:    

Similar News