ఆన్‌లైన్ మనీ గేమ్‌లపై నిషేధం..
లోక్‌సభలో బిల్లుకు ఆమోదం..;
డబ్బుతో ఆడే ఆన్‌లైన్ గేమ్(Online money games)లకు కేంద్రం చెక్ పెట్టింది. లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టిన ‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025’ బిల్లుకు బుధవారం (ఆగస్టు 20) ఆమోదం లభించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు కొంతమంది బానిస కావడం, మనీలాండరింగ్, ఆర్థిక మోసాల వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. పార్లమెంటు దిగువ సభలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.
‘ఉల్లంఘిస్తే రూ. కోటి జరిమానా..’
"ఆన్‌లైన్ మనీ గేమ్‌ల వల్ల చాలా కుటుంబాలు నాశనమయ్యారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇందులో కోల్పోతున్నారు. అల్గోరిథంలో కొన్నిసార్లు ఎవరితో ఆడుతున్నారో తెలుసుకోవడం కూడా కష్టం. ఆన్‌లైన్ మనీ గేమ్‌లను ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు.’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఆమోదం పొందిన బిల్లు ప్రకారం.. సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనదారులు, ప్రమోటర్లు, ఈ గేమ్‌లకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే వారికి చట్టపరంగా చర్యలు తప్పవు అని అశ్విని వైష్ణవ్ హెచ్చరించారు. ఉల్లంఘించిన వారికి రూ. కోటి జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని పేర్కొన్నారు.