ఓటరు జాబితా సవరణపై సుప్రీంకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా..
బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని పిటీషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరిన టీఎంసీ ఎంపీ ..;
బీహార్(Bihar)లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) పేరిట ఓటరు లిస్టును అప్‌డేట్ చేసేందుకు ఈసీ ఇటీవల ఓ సర్య్కూలర్ విడుదల చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని మోయిత్రా తన పిటీషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఏమిటీ S.I.R..
బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) పేరిట ఓటరు జాబితాను అప్‌డేట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ భావించింది. ఈ మేరకు ఓ సర్య్కూలర్ కూడా జారీ చేసింది. దాని ప్రకారం 1987 తర్వాత జన్మించిన వారు ఓటరుగా నమోదు చేసుకోడానికి వారి బర్త్ సర్టిఫికేట్‌తో పాటుగా తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని భారత కూటమి(I.N.D.I.A)లోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నాయి. SIR వల్ల బీహార్‌లో 8 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 20 శాతం మంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. కూటమిలోని ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, ఎన్‌సీపీ-ఎస్పీ పార్టీల తరుపున 20 మంది సభ్యుల బృందం SIRపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ అపాయింట్‌మెంట్ కోరింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో సింఘ్వీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, సీపీఐ-ఎంఎల్ఎల్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య SIRపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. SIR నిర్వహిస్తే లక్షలాది బీహార్ ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఓటు హక్కు కోసం ఇప్పుడు పేదలు, నిరక్షరాసులు, వలస కూలీలు బర్త్ సర్టిఫికేట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాలా? అని ప్రశ్నించారు.
"పనుల కోసం బీహార్ ఓటర్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. ఇలా వెళ్లిన వారు 20 శాతం కంటే ఎక్కువగానే ఉంటారు. ఈసీ ఇచ్చిన నెల గడువులోపు కొత్తగా వాళ్లు ఓటరుగా నమోదుచేసుకోలేరు’’ అని సీపీఐ నేత భట్టాచార్య ECకి చెప్పినట్లు తెలిసింది.
బిహారీ వలసదారులను అటుంచితే.. వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంతమంది స్థానికతకు సంబధించిన పత్రాలను కోల్పోయి ఉండవచ్చు. వాళ్ల పరిస్థితి ఏమిటని బృంద సభ్యులు ప్రశ్నించారు. "బీహార్‌లో మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్ష కూటమి)కు ఓటు వేయాలని చూస్తున్న ఓటర్లను తొలగించడానికే బీజేపీ ఈసీతో ఈ పనిచేయిస్తుందని ఆరోపించారు. మొత్తం మీద కూటమి సభ్యులు ఎన్నికల ముగిసేవరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ECని కోరారు.
బీహార్‌లో చివరిసారిగా ఇలాంటి సవరణ 2003లో జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ వాదన మరోలా ఉంది. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాపై చాలా ప్రశ్నలు లేవనెత్తింది ప్రతిపక్షమేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.