‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి’
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ;
ఉగ్రవాదంపై తమ వైఖరి వివరించేందుకు భారత ప్రతినిధి బృందాలు విదేశీ పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ బృందాలు పాక్ దుశ్చర్యలను, ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) గురించి వివరిస్తాయి. ఈ అఖిలపక్ష ప్రతినిధులు స్వదేశానికి తిరిగి వచ్చాక పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) శుక్రవారం కేంద్రాన్ని కోరారు. ప్రపంచ దేశాల స్పందన గురించి దేశ ప్రజలకు తెలియజేయడం కూడా ముఖ్యమని తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌కు సమీపాన ఉన్న పహెల్గామ్‌లో ప్రవేశించిన ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులపై తుపాకులతో గురిపెట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతిచర్యగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి సుమారు 100 మందిని హతమార్చింది.
ఇప్పటికే బయలుదేరిన బృందాలు..
జేడీ (యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కె కనిమొళి, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మూడు బృందాలు బుధవారం (మే 21) తమకు కేటాయించిన దేశాలకు బయలుదేరాయి.
ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారువా, హేమాంగ్ జోషి (బీజేపీ), సీపీఎం జాన్ బ్రిట్టాస్, మాజీ విదేశాంగ మంత్రి కాంగ్రెస్ ప్రముఖుడు సల్మాన్ ఖుర్షీద్, రాయబారి మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇండోనేషియా, మలేషియా, జపాన్, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాను సందర్శిస్తారు.
కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీజేపీకి చెందిన బ్రిజేష్ చౌతా, ఎస్పీకి చెందిన రాజీవ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్, ఆర్జేడీకి చెందిన ప్రేమ్ చంద్ గుప్తా, ఆప్‌కు చెందిన అశోక్ మిట్టల్, రాయబారులు మంజీవ్ పూరి, జావేద్ అష్రఫ్ ఉన్నారు. వీరు స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాకు వెళ్తారు.
శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీజేపీకి చెందిన బన్సూరి స్వరాజ్, అతుల్ గార్గ్, ఎస్ఎస్ అహ్లువాలియా, మనన్ కుమార్ మిశ్రాతో పాటు ఐయుఎంఎల్‌కు చెందిన ఇటి మొహమ్మద్ బషీర్, బిజెడికి చెందిన సస్మిత్ పాత్రా, రాయబారి సుజన్ చినాయ్ ఉన్నారు. వీరు యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్‌లను సందర్శిస్తారు.
కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా నేతృత్వంలోని మిగిలిన నాలుగు ప్రతినిధి బృందాలు వారికి కేటాయించిన దేశాలకు బయలుదేరి వెళ్తాయి.