పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి నిధులు దుర్వినియోగం..
యూపీ కంటే తమిళనాడుకు ఎక్కువ నిధులు ఇచ్చామన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్;
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) పథకం నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఉత్తరాది రాష్ట్రంలో 20 కోట్ల జనాభా ఉండగా తమిళనాడు(Tamil Nadu) జనాభా 7 కోట్లు అయినప్పటికీ.. ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. దీనిపై డీఎంకె ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి హామీ పథకం అమలు గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పశ్చిమ బెంగాల్‌కు ఇచ్చిన నిధుల్లో దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. పనులను విభజించి నామినేట్ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు.
"మేము ఆడిట్ బృందాన్ని పంపాం. 44 పనులలో అవకతవకలు జరిగాయని గుర్తించారు. 34 కేసుల్లో పూర్తిగా రికవరీ చేశారు. ఇంకా 10 చేయాల్సి ఉంది. ఆర్థిక దుర్వినియోగం రూ. 5.37 కోట్లు కాగా రూ. 2.39 కోట్లు రికవరీ అయ్యింది.’’ అని చెప్పారు మంత్రి.
"తమిళనాడు ఇప్పటికే రూ. 7,300 కోట్లు (ఈ ఆర్థిక సంవత్సరం) అందుకుంది. గతంలో ఏడు కోట్ల జనాభా ఉన్న తమిళనాడుకు రూ. 10వేల కోట్లకు పైగా నిధులు అందాయి. ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్ల మంది. అయితే అందింది దాదాపు రూ. 10వేల కోట్లు. ఇందులో పక్షపాతం అనే ప్రశ్నే లేదు" అని అనడంతో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సభలోని వెల్‌లోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు కూడా నిరసనల్లో పాల్గొని, వెల్ దగ్గర నిలబడి ఉన్న వారిలో కొంతమందికి సంఘీభావంగా తమ సీట్ల నుంచి లేచి నిలబడ్డారు. స్పీకర్ ఓం బిర్లా వారిని తమ సీట్లకు తిరిగి వెళ్లమని కోరినా వారు చలించలేదు. తరువాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 15 నిమిషాలు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తిన ప్రశ్నలను "రాజకీయం" చేయవద్దని ప్రతిపక్షాలను బిర్లా కోరారు.
కేరళ(Kerala)కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాష్ కూడా తన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు తగ్గాయని, డబ్బుల చెల్లింపులలో జాప్యం తక్కువ వేతనాలే అందుకు కారణమని చెప్పారు.
"కేరళలోని కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు అందలేదు. ఈ పథకం కింద రూ. 811 కోట్లు రావాల్సి ఉంది. గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ MGNREGA వేతనాలను ద్రవ్యోల్బణంతో అనుసంధానించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని ఆలస్యం చేయకుండా విడుదల చేస్తుందా?" అని ప్రకాష్ ప్రశ్నించారు.
"గత సంవత్సరం కేరళకు రూ. 3,500 కోట్లు వచ్చాయి. చెల్లింపుల విడుదల నిరంతర ప్రక్రియ. పెండింగ్‌లో ఉన్నవన్నీ రాబోయే కొన్ని వారాల్లోనే క్లియర్ అవుతాయి" అని సభకు హామీ ఇచ్చారు.
MGNREAG కింద హర్యానాలో అత్యధికంగా రూ.374 వేతనం ఇస్తున్నామని, కేరళ, కర్ణాటకలలో దాదాపు రూ.350 ఇస్తున్నామని, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప రేటు రూ.234 ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తానికి సంబంధించిన గణాంకాలను కూడా ఆయన ఇచ్చారు. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో రూ.61,000 కోట్లు బడ్జెట్ అంచనాగా ఉన్నాయని, చివరికి కేంద్ర ప్రభుత్వం రూ.50,000 కోట్లు విడుదల చేసిందని, దీంతో మొత్తం రూ.1,10,000 కోట్లకు చేరుకుందని ఆయన చెప్పారు.
"గత రెండు సంవత్సరాలను పరిశీలిస్తే, బడ్జెట్ అంచనా రూ. 73,000 కోట్లు. కానీ మేం దాన్ని రూ. 98,000 కోట్లు విడుదల చేసాము. కాబట్టి డబ్బు విడుదల చేయకపోవడం, మొత్తాన్ని పెంచకపోవడం అనే ప్రశ్నే లేదు" అని మంత్రి అన్నారు.
MGNREGA, West Bengal, Tamil Nadu, Utter Pradesh, Kerala,