బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం అప్పుడే..!
న్యాయనిపుణుల సలహాల మేరకే ముందుకెళ్లాలని నిశ్చయించుకున్న తెలంగాణ క్యాబినెట్.
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం.. న్యాయనిపుణుల సలహాలను అనుసరించాలని నిర్ణయించుకుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ అంశంపై చేసిన బిల్లు, ఆర్డినెన్స్.. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో తీసుకొచ్చిన జీఓ నెం.9పై హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ విచారణలో ఉంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు.
బీసీ రిజర్వేషన్ల పై ఇప్పటికే హై కోర్ట్ మధ్యంతర తీర్పు, సుప్రీం కోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలపై హై కోర్ట్ లో ఉన్న ఒక పిటిషన్ నవంబర్ 3న విచారణకు రానుంది. ఆ రోజున హైకోర్టులో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం జరిగింది. ఆ రోజున రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినేట్ తీర్మానించింది.
ఇద్దరు పిల్లల నిబంధన రద్దు..
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ప్రొరోగ్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తో ఆర్డినెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రతిపాదన ఫైలును గవర్నర్ గారికి పంపించాలని మంత్రివర్గం ఆమోదించింది.