పాతబస్తీలో భారీగా గంజాయి పట్టివేత
రూ.2.7 కోట్ల విలువ చేసే 908 కిలోల గంజాయి స్వాధీనం
పాతబస్తీలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రూ.2. 7 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంత రాష్ట్ర గంజాయి ముఠాతో సంబంధమున్న ఈ ముగ్గురు వ్యక్తులు మహరాష్ట్రకు తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్టు సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ మీడియాతో చెప్పారు.
ఒడిశాలోని మల్కన్ గిరి ప్రాంతం నుంచి హైద్రాబాద్ మీదుగా మహరాష్ట్ర నాసిక్ ప్రాంతానికి తరలిస్తుండగా పోలీసులకు సమాచారమందింది. పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
గంజాయిని రవాణా చేస్తున్న డ్రైవర్ మహమ్మద్ ఖలీముద్దీన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు అని పోలీసులు చెప్పారు. అతనితో బాటు ఎ2 షేక్ సోహెల్, ఎ3 మహమ్మద్ అప్జల్ లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన రహమాన్, ఒడిషాకు చెందిన జిత్తు, శ్రీకాకుళం కు చెందిన సురేష్, మహరాష్ట్రకు చెందిన మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఒడిశా మల్కన్ గిరి అటవీ ప్రాంతంలో సురేశ్, జిత్తు వద్ద మహేశ్ గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయించేవాడని పోలీసులు చెప్పారు.డిసిఎం ట్రాన్స్ పోర్ట్ వాహనం, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.రహమాన్ గంజాయి ప్రధాన రవాణాదారుడని పోలీసులు పేర్కొన్నారు.
జీడిపప్పు క్రింద దాచి రవాణా
గంజాయిని తరలించడానికి ఈ ముఠా అనేక ఎత్తుగడలు అనుసరించేదని పోలీసుల విచారణలో తేలింది. జీడిపప్పు బ్యాగుల క్రింద గంజాయిని దాచి తరలించేవారు.నిందితుడైన రహమాన్ గంజాయిని రవాణా చేయడానికి శ్రీకాకుళంకు చెందిన సురేష్ వద్ద మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వసూలు చేసేవాడు. భారీ మొత్తంలో నగదు అందడంతో రహమాన్ గంజాయి రవాణాకు అంగీకరించాడు .రాష్ట్రంలో గంజాయిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వంఈగల్ టీంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒరిస్సాకు నుంచి 500 కెజీల గంజాయిని యుపికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.ఈగల్ టీం చేస్తున్న భారీ ఆపరేషన్లలోకోట్లాది రూపాయల గంజాయి పట్టు బడుతోంది. ఉత్తర ప్రదేశ్ వారణాసికి గంజాయి రవాణా అవుతుందని ఈగల్ టీంకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో గంజాయి రవాణా అయ్యే వాహనాన్ని పోలీసులు వెయ్యి కిలోమీటర్లు చేజింగ్ చేసి పట్టుకున్నారు.