సెబీ చీఫ్‌పై లోక్‌పాల్‌కు మోయిత్రా ఫిర్యాదు
సెబీ (Securities and Exchange Board of India) చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్‌పై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా శుక్రవారం (సెప్టెంబర్ 13) లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు.
సెబీ (Securities and Exchange Board of India) చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్‌పై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా శుక్రవారం (సెప్టెంబర్ 13) లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె క్విడ్ ప్రోకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఫిర్యాదును ఎలక్ట్రానిక్, భౌతిక రూపంలో లోక్‌పాల్‌కు సమర్పించారు. ‘ప్రాథమిక దర్యాప్తు కోసం నా క్లయింట్‌ను CBI/EDకి రెఫర్ చేయాలి. విషయం కోట్లాది మంది పెట్టుబడిదారుల ప్రయోజనాలకు సంబంధించినది కావడంతో ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిపించి, విచారించాలి.’’ అని తన మూడు పేజీల లేఖలో లోక్‌పాల్‌ను కోరారు.
అదానీ గ్రూప్‌పై SEBI చర్యలు తీసుకోలేదని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆగస్టులో ఆరోపించింది. బుచ్, ఆమె భర్త బెర్ముడా, మారిషస్‌లోని ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో బినామీ పెట్టుబడులు పెట్టారని కూడా పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నిధులు, స్టాక్ ధరలను పెంచడానికి డబ్బును ఉపయోగించారని హిండెన్‌బర్గ్ ఆరోపించారు.
సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో మహువా మొయిత్రా లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
2017 నుంచి 2021 వరకు సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవీ బుచ్.. 2022 మార్చిలో సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. సెబీలో చేరినప్పటికీ ఆమె ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో జీతం పొందారని కాంగ్రెస్ ఆరోపించింది. సెబీ చీఫ్‌గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి వేతనం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. వేతనం అందుతుండడం వల్లే ఆ బ్యాంక్‌పై పలు విచారణలు నిలిచిపోయాయని ఆరోపించింది. అయితే 2013 అక్టోబరు 31న ఆమె ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నుంచి అందుకు సంబంధించిన ప్రయోజనాలు మినహా ఎటువంటి వేతనం చెల్లించడం లేదని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది.