కర్ణాటకలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల నిరసన
నిరసనలో పాల్గొన్న కోలార్, చిత్రదుర్గ, ఉడిపి, కాసర్‌గోడ్, కన్నూర్, హాసన్, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాలకు చెందిన మతపెద్దలు..;
వక్ఫ్ సవరణ(Waqf Act) చట్టాన్ని రద్దుచేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ కర్ణాటక (Karnataka) రాష్ట్ర ఉలేమా సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు లక్ష మందికిపైగా ముస్లిం మహిళలు (Muslims protest) అడయార్‌లోని షా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని హరిస్తున్నారంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇటీవల కర్ణాటకలో ముస్లిం సమాజం నిర్వహించిన అతిపెద్ద బహిరంగ సభలలో ఇది ఒకటి.
‘ముస్లిం సమాజాన్ని బలహీనపర్చేందుకే..’
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు షేక్‌హుల్లా తఖ్వా ఉస్తాద్ మాట్లాడుతూ.. ముస్లిం సమాజాన్ని బలహీనపర్చడానికే వక్ఫ్ చట్టంలో మార్పులు చేశారని ఆరోపించారు. ‘‘ముస్లిం సమాజం గతంలో కూడా అణచివేతను ఎదుర్కొంది. కానీ ఈసారి చట్టాన్ని తీసుకొచ్చి వక్ఫ్ ప్రాముఖ్యతను తగ్గించేందుకు కేంద్రం కుట్ర పన్నింది,’’ అని ధ్వజమెత్తారు.
కర్ణాటక వక్ఫ్ బోర్డు మాజీ కార్యదర్శి షఫీ సయీదీ మాట్లాడుతూ.. చట్ట సవరణ రాజకీయ ఎజెండాలో భాగమని ఆరోపించారు. "ఈ దేశాన్ని పాలిస్తున్న ఫాసిస్ట్ శక్తులను మేం బయటపెడతాం. మే 5న సుప్రీంకోర్టు మా వైఖరిని సమర్థిస్తుందని విశ్వసిస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఈ నిరసన ఏ సమాజానికి లేదా రాజకీయ భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదని చెబుతూ.. "మా పోరాటం మా సంస్కృతిని, వక్ఫ్ వెనుక మతపర ఉద్దేశ్యాన్ని కాపాడుకోవడం గురించి. 1985లో షా బానో కేసు సమయంలో మేం ఇదే ఐక్యతని ప్రదర్శించాం," అని చెప్పారు.
"ఈ నిరసన ప్రదర్శనకు లక్ష మందికి పైగా ముస్లింలు తరలివచ్చారు. షా కన్వెన్షన్ సెంటర్ జాతీయ రహదారి 75 కి దగ్గరగా ఉండటం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కొంత సమయం పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది" అని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో కోలార్, చిత్రదుర్గ, ఉడిపి, కాసర్‌గోడ్, కన్నూర్, హాసన్, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాలకు చెందిన ముస్లిం మతపెద్దలు పాల్గొని ప్రసంగించారు. "ఒకప్పుడు దేశవ్యాప్తంగా 36 లక్షల ఎకరాల వక్ఫ్ భూములపై ముస్లింల నియంత్రణ ఉండేది. ఇప్పుడు అది కేవలం 9 లక్షల ఎకరాలకు తగ్గింది" అని వక్తలలో ఒకరు పేర్కొన్నారు.
కొత్త చట్టం ప్రకారం 11 మందిలో నలుగురు ముస్లిం సభ్యులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇద్దరు హిందూ సభ్యులు, ఇతరులలో ఎక్కువ మంది ప్రభుత్వం నియమించిన వారు లేదా ఎక్స్-అఫిషియో సభ్యులు ఉంటారని చెబుతూ.."ఇది ముస్లిం సమాజంపై వివక్ష కాదా?" అని వక్తలు ప్రశ్నించారు.
ముస్లిం సమాజంలోని బోహ్రా, ఆగా ఖానీ వర్గాలు మౌనంగా ఉండటాన్ని మతపెద్దలు తప్పుబట్టారు. వారిపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లే అందుకు కారణమని ఆరోపించారు.
ఒకప్పటి అగా ఖానీ వక్ఫ్‌కు చెందిన భూమిలో దక్షిణ ముంబైలోని అంబానీ నివాసం ఉంది. "ప్రభుత్వం అక్కడికి కూడా బుల్డోజర్లను పంపుతుందా?" అని ఆయన ప్రశ్నించారు.
ముస్లిం సమాజం మతపర హక్కులను పరిరక్షించాలని కోరుతూ ముస్లిం మత పెద్దలు నిరసనను ముగించారు.