దేశంలో వరుసగా మూడో సారి అధికారం చేపట్టాలని కంకణం కట్టుకున్న బీజేపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కంటే ముందే తన తొలి జాబితాను ప్రకటించింది. మార్చి 2న ప్రకటించిన తొలి జాబితాలో 195 మందితో కూడిన లిస్ట్ ను వెల్లడించింది. ఈ జాబితాను గమనిస్తే మనకో విషయం అర్థమవుతుంది.
ఈ సారి గెలుపు కోసం బీజేపీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు అని. అభ్యర్థులకు ప్రకటించిన స్థానాలు కూడా గత ఎన్నికల్లో బీజేపీ సునాయంగా విజయం సాధించినవే మెజారిటీవి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్న స్థానాలు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా పార్టీ అనుసరిస్తున్న సాంప్రదాయ రేఖకే ఎక్కువగా కట్టుబడి ఉన్నాయి. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, హిందీ బెల్ట్ రాష్ట్రాలలో పార్టీ ప్రభంజనాన్ని కొనసాగించడానికి బీజేపీ వేసిన ఎత్తుగడ ఈ జాబితా ప్రకటన అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అభ్యర్థులను ప్రకటించిన 195 స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాశి నుంచి పోటీ చేయడం మొదలుకుని దాదాపు 80 శాతం స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులు గత ఎన్నికల్లో గెలిచిన వారే. వీరిలో ఎక్కువమంది దాదాపు లక్ష మెజారిటితో గెలిచిన వాళ్లే. అయితే గుజరాత్, రాజస్తాన్,మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రకటించిన అభ్యర్థులు మాత్రం రెండు లక్షల పై చిలుకు ఓట్లతో గడిచిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులని ఎన్నికల సంఘం గణాంకాలు చూస్తే తెలుస్తోంది. కాబట్టి ఈ సారి కూడా కంఫర్ట్ విక్టరీ సాధించాలని పార్టీ చూస్తోంది.
అంత ఈజీగా ఏం ప్రకటించలేదు
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ 51 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 42 మంది సిట్టింగులకు తిరిగి టికెట్లు ఇచ్చింది. అలాగే గుజరాత్ లో ప్రకటించిన 15 సీట్లలో కూడా 12 మంది సిట్టింగులకు అవకాశం ఇచ్చింది. ఇందులో కేవలం ముగ్గురిని మాత్రమే పార్టీ మార్చింది. అయితే ఇవన్నీ అంత సులభంగా ఏంజరగలేదన్నది బీజేపీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఫెడరల్ తో మాట్లాడుతూ " మెజారిటీ ఎంపీలకు ఈ సారి టికెట్లు దక్కాయి. అంతే ఇదంతా ఆషామాషీగా జరగలేదు. సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేకండా అందరికి టికెట్లు ఇవ్వడానికి ఈ పద్ధతిని పాటించాం. వారి పనితీరును పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో అంచనావేశాం. అనేక దశల్లో ఇవన్నీ వడపోశాం. అలాగే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో కూడా నివేదికలు పరిశీలించాం. అలాగే పార్టీ ఆర్గనైజేషన్ వ్యవస్థల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం, తరువాతే టికెట్లు ఇచ్చాం " అని వివరించారు. సీనియర్ లీడర్లు అయితే సామాజిక మాధ్యమాల్లో వారి పనితీరును అంచనా వేసిన తరువాతనే టికెట్లు ఇచ్చామని వెల్లడించారు.
గౌరవప్రదమైన ముగింపు
కొంతమంది సీనియర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపలేదు. వారిలో హర్షవర్ధన్ రాణే, జయంత్ సిన్హా వంటి వారు ఉన్నారు. దీంతో వీరి పేరును మొదటి జాబితాలో ప్రకటించలేదు. క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా తాను రాజకీయాల నుంచి క్విట్ అవుతానంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. క్రికెట్ కు ఎక్కువ సమయం కేటాయించకలేకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. వీరి నిర్ణయాన్ని కూడా పార్టీ గౌరవించింది. అలాగే వీరి బాటలోనే గుజరాత్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా రాజకీయాల నుంచి విశ్రాంతి కోరుకోవడంతో ఆయన పేరును ప్రకటించలేదు.
దేశ రాజధానిలో నలుగురిని మార్చిన బీజేపీ
వివాదస్పద వ్యాఖ్యాలతో పార్టీకి తలనొప్పులు తెచ్చిన ఢిల్లీ ఎంపీలకు కూడా పార్టీ ఈసారి టికెట్లు నిరాకరించింది. వీరిలో రమేష్ బిధూరి ఒకరు. ఇతని స్థానంలో దక్షిణ ఢిల్లీ క్యాండేట్ గా రామ్ వీర్ సింగ్ భిధూరికి టికెట్ కేటాయించింది. అలాగే కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ స్థానంలో మాజీ విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరీ స్వరాజ్ కు టికెట్ కేటాయించారు. చాందీని చౌక్ నుంచి మాజీ కేంద్ర మంత్రి హర్షవర్థన్ రాణే స్థానంలో ప్రవీణ్ ఖండేవాల్ కు నిలబెట్టింది. రెండు సార్లు ఎంపీగా గెలిచిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ స్థానంలో ఈ సారి కమల్ జీత్ సెహ్రవాట్ ను పశ్చిమ ఢిల్లీ అభ్యర్థిగా కమల దళం ప్రకటించింది.
ప్రతిపక్ష పార్టీలతో గట్టి పోరాటం.
బీజేపీ ప్రకటించిన 195 స్థానాలలో ప్రతిపక్ష పార్టీలతో గట్టి పోరాటం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ప్రకటించిన 40 శాతం సీట్లలో కాంగ్రెస్ తో బీజేపీ ముఖాముఖి తలపడబోతోంది. వీటిలో ఎక్కువగా గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన 40 శాతం సీట్లలో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ చావోరేవో తేల్చుకోబోంది. అయితే ఇవన్నీ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నవే ఎక్కువ.
" ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. బీజేపీ సేఫ్ సీట్లను టార్గెట్ చేసింది. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలలో టార్గెట్ చేసింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడటానికి తన సైన్యాన్ని సిద్ధంగా చేసుకుంది " అని పంజాబ్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ అశుతోష్ కుమార్ ఫెడరల్ తో చెప్పారు. వీటిలో దాదాపు 220 స్థానాలు కాంగ్రెస్ తో నేరుగా బీజేపీ పోటీ పడుతోంది. అయితే ఇందులో మెజారిటీ సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో బీజేపీ, ఎస్పీతో ఎక్కువగా పోటీ పడుతోంది. ఇవే కాకుండా మరికొన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఈ ఎన్నికల్లో నేరుగా పోటీీ పడుతోంది.