బీజేడీ అధ్యక్షుడిగా మరోసారి నవీన్ పట్నాయక్..
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ ఆఫీసర్ పీకే దేబ్..;
ఒడిశా(Odisha) మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) శనివారం వరుసగా తొమ్మిదోసారి బిజు జనతాదళ్ (BJD) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శంఖ భవన్‌లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయనను పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీకే దేబ్ ప్రకటించారు. ఆయన పేరు ప్రకటించిన వెంటనే.. పార్టీ నాయకులు పట్నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది ఆయనకు జగన్నాథుని 'మహా ప్రసాదం' అందజేశారు. పార్టీ రాష్ట్ర మండలిలో 355 మంది సభ్యులు ఉన్నారని, వారిలో 80 మంది రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికయ్యారని దేబ్ తెలిపారు.
రాజకీయ ప్రవేశం..
1946 అక్టోబర్ 16న కటక్‌లో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్, ఆయన భార్య జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు జన్మించిన నవీన్ పట్నాయక్.. తండ్రి మరణానంతరం 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒడిశాలోని అస్కా పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందారు. డిసెంబర్ 26, 1997న తన తండ్రి పేరున బిజు జనతాదళ్‌ను స్థాపించారు. ఒడిశా 2000 అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు.
2004 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓడిపోయింది. అయితే నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని సంకీర్ణం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. కొంతకాలానికి పాలక భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడంతో బీజేడీ నుంచి బీజేపీ విడిపోయింది.
2009లో ఒడిశా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు ముందు..బీజేడీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్, కొన్ని ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన నవజాత థర్డ్-ఫ్రంట్‌తో జతకట్టింది. 2009లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. 21 లోక్‌సభ స్థానాల్లో 14, 147 అసెంబ్లీ స్థానాల్లో 103 స్థానాలను గెలుచుకుంది. వరుసగా మూడోసారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికలు, 2014లో శాసనసభ ఎన్నికలు రెండింటిలోనూ పట్నాయక్ భారీ విజయం సాధించారు. పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాల్లో 20 స్థానాలను, 147 ఒడిషా విధానసభ స్థానాల్లో 117 స్థానాలను గెలుచుకుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజు జనతాదళ్ ఒడిశా శాసనసభలో 146 స్థానాలకు 112 స్థానాలను, 21 లోక్‌సభ స్థానాలకు 12 స్థానాలను గెలుచుకుంది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 147 స్థానాలకు బీజేపీ అత్యధికంగా 78 స్థానాలు గెలుపొంది అధికార పీఠం దక్కించుకుంది. మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేడీకి 51, కాంగ్రెస్‌కు 14, సీపీఐ (ఎం)కు 1, ఇండిపెండెంట్లకు 3 స్థానాలు దక్కాయి.