టెర్రరిస్టులకు కఠిన శిక్ష తప్పదు..
కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం..;
కాశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో ఉగ్రదాడి నిందితులకు, కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. బైసరన్ లోయలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే, 'మన్ కీ బాత్(Mann Ki Baat)' కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం బలపడి, శాంతి నెలకొనడాన్ని జీర్ణించుకోలేక దాడులకు తెగబడి ప్రజలను భయాందోళనకు గురిచేయాలని చూస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదంపై యావత్ ప్రపంచానిది ఒకటేనని, టెర్రరిజాన్ని అంతం చేయడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు.
దర్యాప్తును ఎన్ఐఏ(NIA)కు అప్పగింత..
పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించింది. ఎన్ఐఏలో ఉన్న ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. వారు బైసరాన్ లోయలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను గమనించి పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరంగా తెలుసుకోనున్నారు. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను వెలికితీయాలన్నదే ఎన్ఐఏ లక్ష్యమని అధికారులు చెప్పారు.
పాక్ సైన్యం కాల్పులు..
ఏప్రిల్ 26, 27 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇలా నిబంధనలను ఉల్లంఘించడం ఇది వరుసగా మూడోసారి. పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం సమర్థంగా ప్రతిస్పందించిందని అధికారులు తెలిపారు.