హేతువాది దభోల్కర్ హత్య కేసులో ఎట్టకేలకు తీర్పు

హేతువాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే సాకుతో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ కేసులో 11 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఇందులో ఏమన్నారంటే

Update: 2024-05-10 09:03 GMT

మహారాష్ట్ర మూఢ నమ్మకాల నిర్మూలన కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో పూణే ప్రత్యేక న్యాయస్థానం 11 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరికి జీవితఖైదు శిక్ష విధించింది. ముగ్గుర్ని విడిచిపెట్టింది. జీవిత ఖైదు విధించిన వారిలో సచిన్ అందూరే, శరద్ కల్స్కర్ ఉన్నారు. వారిద్దరినీ ప్రత్యేక న్యాయమూర్తి హత్యా నేరం చేసిన వారిగా పరిగణించారు. దీంతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులు డాక్టర్ వీరేంద్ర సింగ్ తావ్డే, సంజీవ్ పునలేకర్, విక్రమ్ భావేలపై బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. హత్యకు ప్రధాన సూత్రధారి మోకత్ అసున్‌పై దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నరేంద్ర దభోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్ కోరారు. అదే సమయంలో ముగ్గురు నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయడమంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని ముక్తా అన్నారు.

ప్రముఖ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ 2013 ఆగస్టు 20న హత్యకు గురయ్యారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తన గళం వినిపించిన దభోల్కర్‌.. ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ స్థాపించి ప్రజల్లో అవగాహన కల్పించేవారు. ఆ క్రమంలోనే ఆయనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. 2013, ఆగస్టు 20న మార్నింగ్ వాక్ కు వెళ్లినపుడు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొదట పుణె పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా.. తర్వాత దానిని సీబీఐకి బదిలీ చేశారు. 11 ఏళ్ల తర్వాత ఈ కేసులో దోషులకు శిక్ష పడింది.
ఇది మొత్తం 11 ఏళ్ల పోరాటం. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సహాయంతో మహారాష్ట్ర మూఢనమ్మకాల నిర్మూలన కమిటీ కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులందరితో కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఈ ఇద్దరికైనా శిక్షపడిందని ముక్తా దభోల్కర్ అన్నారు. '11 ఏళ్లు పోరాటం చేస్తే గాని ఈ న్యాయం అందలేదు. దీంతోనైనా న్యాయం అందుతుందన్న భావన మనందరి మనస్సులలో సజీవంగా ఉంటుంది. ఈ న్యాయంతో సంతృప్తి చెందాల్సిన పని లేదు. ఈ తీర్పు ఆధారంగా నిందితులపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్తాం. మా న్యాయవాది అభయ్ నెట్గీ మార్గదర్శకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది' అన్నారు ఆమె.
దభోల్కర్ హత్యకేసులో నిందితుడు తావ్డే పాత్ర నిరూపితం కాకపోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అతనిపై నేరాన్ని రుజువు చేయడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలమయ్యాయి. తార్ భావే, పునావలేకర్‌లకు వ్యతిరేకంగా కూడా పోలీసులు సరైన సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమయ్యారు. అందువల్ల, ఆ ముగ్గురు నిందితులకు శిక్ష పడేలా పోరాడతామని ముక్తా స్పష్టం చేశారు. ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు నరేంద్ర దభోల్కర్ అనుచరులు.
ఆగస్టు 20న పూణేలో జరిగిన హేతువాద కార్యకర్త నరేంద్ర దభోల్కర్ హత్యను చాలామంది రచయితలు, సామాజిక సేవా కార్యకర్తలు ఖండించారు. హత్యకు గల కారణాలు తెలియనప్పటికీ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రచారం గిట్టని తీవ్రవాద మూకలు మట్టుబెట్టినట్టు ఆరోపించారు. దభోల్కర్ హత్య అనంతరం ఆయన ప్రతిపాదించిన బిల్లు తరహాలో మూఢనమ్మకాలపై ఆర్డినెన్స్‌ను ఆగస్టు 22న మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అయితే చట్టంగా మాత్రం మారలేదు. హేతువాద ఉద్యమానికి సుదీర్ఘ, గౌరవప్రదమైన చరిత్ర ఉన్న ఇతర రాష్ట్రాలలో - ప్రత్యేకించి తమిళనాడులో ఇలాంటి చట్టం అమల్లో ఉంది.
ఎన్నో అనుమానాలు..
“నిందితులైన షూటర్లు పట్టుబడ్డారని మేము భావించాం. అయితే ఈ హేయమైన చర్యల వెనుక ఉన్న సూత్రధారులకు కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కీలకమైన ఇద్దరు నిందితులు నిర్దోషులుగా తప్పించుకున్నారు. వారిపై న్యాయపోరాటం చేస్తాం అంటున్నారు డాక్టర్ హమీద్ దభోల్కర్.
సుప్రసిద్ధ హేతువాది దభోల్కర్ 2013 ఆగస్టు 20న పూణే ఓంకారేశ్వర్ వంతెనపై మార్నింగ్ వాక్ చేస్తుండగా కాల్చివేశారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దభోల్కర్ చేసిన పోరాటాన్ని నిందితులు వ్యతిరేకించారని ప్రాసిక్యూషన్ తన తుది వాదనలో పేర్కొంది. ఈ కేసును తొలుత పూణె పోలీసులు విచారించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) 2014లో విచారణ చేపట్టింది. హిందూ మితవాద సంస్థ సనాతన్ సంస్థతో సంబంధం ఉన్న ఇఎన్టీ సర్జన్ డాక్టర్ వీరేంద్రసిన్హ్ తవాడే ఈ హత్యకు కుట్రపన్నారని ఆరోపణలు వచ్చాయి.
దభోల్కర్ హత్య తర్వాత నాలుగేళ్ళలో మరో ముగ్గురు హేతువాదుల హత్యలు జరిగాయి. సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే (కొల్హాపూర్, ఫిబ్రవరి 2015), కన్నడ రచయిత ఎంఎం కల్బుర్గి (ధార్వాడ్, ఆగస్ట్ 2015), జర్నలిస్టు గౌరీ లంకేష్ (బెంగళూరు, సెప్టెంబర్ 2017)లో హత్యలకు గురయ్యారు. ఈ కేసులపై ఇంకా విచారణ సాగుతోంది.
Tags:    

Similar News