‘జనాభా ఆధారిత డిలిమిటేషన్‌తో నష్టపోతాం’
సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి కేరళ సీఎం విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరు.;
జనాభా ఆధారిత లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే(DMK) ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
జనాభా ఒక్కటే ప్రమాణంగా కాకూడదు...
"పునర్విభజన ప్రక్రియకు మేం వ్యతిరేకం కాదు. అయితే జనాభా ప్రాతిపదికన చేయడం సరికాదు. తమిళనాడులో ఎంపీ సీట్ల తగ్గడం వల్ల పార్లమెంటులో మా బలం తగ్గుతుంది. మన అభిప్రాయం లేకుండానే చట్టాలు తయారవుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోతారు.రైతులకు సమస్యలు ఎదురవుతాయి," అని స్టాలిన్ (CM Stalin) ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కుటుంబనియంత్రణను పక్కాగా అమలుచేశామని చెప్పిన స్టాలిన్.. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపడితే నష్టపోతామని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుండటంతో..తమిళనాడు ఎంపీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.