అమరావతి తప్ప రాయలసీమ ప్రాజెక్టులు పట్టవా చంద్రబాబు?
చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టులపైనే కాకుండా రాయలసీమ ప్రాజెక్టులపై కూడా శ్రద్ధ చూపాలని సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ కోరారు.;
By : The Federal
Update: 2025-01-28 03:25 GMT
రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్న డిమాండ్ నానాటికీ ఎక్కువ అవుతోంది. కేంద్ర బడ్జెట్ తయారవుతున్న ప్రతిసారీ ఈ డిమాండ్ వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని విపక్షాలు కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారమై శ్రద్ధ చూపాలని కోరాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాయలసీమ ప్రాంతమే వివక్షకు గురవుతోందని ఆరోపిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమే అధికారంలో ఉన్నందున చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు రాబట్టే విషయాన్ని ఆలోచించాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
పోలవరం ప్రాజెక్టుకు ఖర్చును కేంద్రం భరాయిస్తున్నందున అంతే మొత్తంలో నిధులను రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించాలని కోరాయి. రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకు 41 శాతం నిధులను కేటాయించాలని ప్రతిపాదన ఉందని గుర్తు చేశాయి.
20వేల కోట్లు కేటాయించాలి- సీపీఐ
రానున్న బడ్డెట్లో మొదటి ప్రాధాన్యంగా రాయలసీమ ప్రాజెక్టులకు రూ.20,000 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టును జనవరి 27న ఆయన సందర్శించారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం శీతకన్ను వేసిందని విమర్శించారు. రాయలసీమలో వలసలను ఆపాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చంద్రబాబు ప్రభుత్వం దృష్టిపెట్టిందని.. ఇది సరైన పద్ధతి కాదని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరారు. హంద్రీ-నీవా కాలువల కింద ఒక్క ఎకరా ఆయకట్టు కూడా అభివృద్ధి చేయలేదన్నారు. గండికోట ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినా, దానిలో అంతర్భాగమైన వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. పది సంవత్సరాలుగా గండికోట ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నా నిర్వాసితులకు న్యాయం జరగలేదన్నారు రామకృష్ణ.
అమరావతితో పాటు దీన్నీ చూడండి..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టులపైనే కాకుండా రాయలసీమ ప్రాజెక్టులపై కూడా శ్రద్ధ చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు ప్రాంతంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కార మార్గానికి కృషి చేస్తామని చెప్పారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కాంగ్రెస్ డిమాండ్ ఏమిటంటే..
వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి నిధులను కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. దేశంలో ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సిలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాలు మంజూరు చేయించడంలో విఫలమైందన్నారు. కార్పొరేట్లకు మాత్రం పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారని విమర్శించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద ఉయ్యాల ప్రాజెక్టు కంటే మరో ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతాన్ని సాగునీటి పరంగా అభివృద్ధి చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు నిధులు ఖర్చు చేపడుతున్నా ఇంతవరకు పనులు పూర్తి కాలేదని, అక్కడ పెట్టే నిధులను రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని చెప్పారు.