చంద్రబాబు వచ్చాడు.. బాదుడు మొదలైంది
ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.;
కూటమి ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబు పాలనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు వచ్చారు.. బాదుడు మొదలైందని మండిపడ్డారు. కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్‌లు తగులుతున్నాయని విమర్శించారు. రూ. 15వేల కోట్లకుపైగా కరెంటు చార్జీలు పెంచారని, గ్రామీణ రోడ్లపైనా పన్నులు వేసే దుస్థితి ఏర్పడందన్నారు. సంపద సృష్టి అంటే చంద్రబాబు దృష్టిలో బాదుడే అని ఎద్దేవా చేశారు. తమ హయాంలో పోర్టులు కట్టడం ప్రారంభించామని, పిప్‌లు కూడా వచ్చే పరస్థితి ఉందని, కానీ చంద్రబాబు వాటిని శనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నారని మండి పడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో జగన్ బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాలు, మోసాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందువల్లే డైవర్షన్ పాలిటిక్స్‌కు చంద్రబాబు పాల్పడుతున్నారని మండి పడ్డారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని తీసుకోవడం దానిపైన ప్రజల్లో గోబెల్ ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం చేస్తున్నారని మండిపడ్డారు. తమకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే తిరిగి తాము అధికారంలోకి వస్తామన్నారు. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి వ్యవహారం ఆశ్చర్యం వేస్తోందన్నారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని, పోర్టుల్లో కస్టమ్స్, భద్రతా సిబ్బందంతా వాళ్ల వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు? ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారని నిలదీశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత వియ్యకుండు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని, కానీ ఆ షిప్ వద్దకు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లలేదని అన్నారు. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారని ప్రశ్నించారు. డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే తమ హయాంలో వాహనాల ద్వారా బియ్యం లబ్ధిదారులకు అందించమన్నారు. కానీ మళ్లీ కూటమి ప్రభుత్వంలో పద్దతులన్నీ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారని ధ్వజమెత్తారు.