మహిళా కమిషన్ దగ్గర కేటీఆర్‌పై దాడికి యత్నం..

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ కూడా కేటీఆర్ మాటలను తప్పుబడుతున్నారు.

Update: 2024-08-24 09:13 GMT

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ కూడా కేటీఆర్ మాటలను తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా అనేక మంది మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఈ వ్యవహారాన్ని తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 24న తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంతలోనే కాంగ్రెస్ మహిళ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కేటీఆర్ తన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ వాహనాన్ని అడ్డుకోవడానికి కూడా కాంగ్రెస్ మహిళా నేతలు ప్రయత్నించారు. దీంతో కేటీఆర్ బయటకు రాకుండా కారులోనే ఉన్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ మహిళా నేతలను అడ్డుకున్నారు. దీంతో వారు కేటీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా కాంగ్రెస్ మహిళా నేతలకు పోటీగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల నేతలు తోపులాటకు పాల్పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రెండు వర్గాలను విడదీసి ఉద్రిక్తతను చల్లబరిచారు పోలీసులు. కానీ కాంగ్రెస్ మహిళా నేతలు కేటీఆర్‌పై దాడికి యత్నించారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే అసలు కేటీఆర్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలు ప్రయాణించడానికి సరిపడా బస్సులు లేవని చెప్పినందుకా అంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ప్రజలకు సరిపడా బస్సులను కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే తమ పార్టీ మహిళా నాయకులపై కాంగ్రెస్ మహిళా నేతలకు చేసిన దాడిపై కూడా మహిళాకమిషన్ చర్యలు తీసుకోవాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు.

Tags:    

Similar News