రాయలసీమ విముక్తి ఉద్యమానికి ఆజ్యం పోయ వద్దు
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి;
పోలవరం ప్రాజెక్టు, అమరావతి, విశాఖ ఉక్కు లకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను మరియు విశాఖ రైల్వే జోన్ ను సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి సఫలీకృతులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే చిత్తశుద్దితో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి రావలసిన నిధులను, ప్రాజెక్టులను సాధించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం నంద్యాల పట్టణంలో వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో తుంగభద్ర, కృష్ణా జలాల సంరక్షణ - అభివృద్ధి అంశంపై ప్రతినిధుల సమావేశం జరిగింది. సమితి ఉపాధ్యక్షులు వైయన్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ప్రతి ఏటా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి కొన్ని వందల టియంసిల నీళ్ళు శ్రీశైలం దాటి దిగువకు పోతున్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారని, ఇదే సందర్భంలో కృష్ణా నది ఎండిపోయిందని, నదిలో నీళ్ళు లేవని చెబుతూ గోదావరి నుంచి బనకచర్లకు నీటిని మళ్ళిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ఎద్దేవా చేసారు.
హక్కుగా వున్న నీటిని రాయలసీమ ఏనాడు పూర్తిగా వాడుకోలేదని అందుకు కారణం దశాబ్దాల కింద మొదలు పెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకపోవడం, ప్రాజెక్టుల కింద వున్న ప్రధాన కాలువల అసంపూర్ణ నిర్మాణాలు, పంట కాలువల మరమ్మతులకు నోచుకోకపోవడమేనని ఆయన విమర్శించారు.
తుంగభద్ర, కృష్ణా జలాల సద్వినియోగానికి కార్యాచరణ చేపట్టకుండా, పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, గోదావరి నుండి బనకచర్ల కు నీళ్ళు తెచ్చి ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలను మభ్యపరచడమేనని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ సాధించకుండా, కడప ఉక్కు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం, రాష్ట్ర విభజన చట్టంలోని జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలను రాయలసీమలో ఏర్పాటు చెయ్యకుండా, రాయలసీమలో ఉన్న విద్యుత్తు నియంత్రణ కార్యాలయం, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తదితర కార్యాలయాలను అమరావతికి తరలించాలనే ప్రయత్నం రాయలసీమ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని విమర్శించారు.
ఇప్పటికైనా పాలకులు రాయలసీమ సమగ్రాభివృద్దికై చేపట్టవలసిన కార్యాచరణను ప్రకటించాలనీ, ప్రజల హృదయ స్పందన అయిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల నిర్మాణాలను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలోని వనరుల వినియోగానికి కార్యాచరణ చేపట్టకపోతే ప్రజలలో అంతర్లీనంగా వున్న "రాయలసీమ విముక్తి ఉద్యమానికి" పాలకులే ఆజ్యం పోసిన వారవుతారని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో సామాజిక రాయలసీమ పార్టీ నాయకులు డాక్టర్ నాగన్న, కెడిసిసి డైరెక్టర్ బెక్కం రామసుబ్బారెడ్డి, మహమ్మద్ పర్వేజ్, ఏరువ రామచంద్రారెడ్డి, సౌదాగర్ ఖాసీం మియా, మాజీ సర్పంచులు రామగోపాల్ రెడ్డి, వుశేని, జూపల్లె గోపాల్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, రవికుమార్, పట్నం రాముడు, గాయకుడు గౌడ్, జనార్ధన్ రెడ్డి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ నాయకులు ఆకుమల్ల రహీం, లాయర్ కృష్ణారెడ్డి, వివిధ మండలాల నుంచి రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.