AP HOME MINISTER |దాడి చేసిన వారెవ్వరినీ వదలమని హెచ్చరించిన హెం మంత్రి
వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓను రాష్ట్ర హోంశాఖ మంత్రి ఫోన్ లో పరామర్శించారు. ఎస్పీతో కూడా మాట్లాడిన ఆమె సంఘటన వివరాలు తెలుసుకున్నారు.
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-28 09:34 GMT
అన్నమయ్య (కడప జిల్లా) రాయచోటి నియోజకవర్గం గాలివీడు ఎంపీడీఓ సీఏ. జవహర్ బాబును రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఫోన్ లో పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆమె అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మాట్లాడి తెలుసుకున్నారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎంపీడీఓ జవహర్ బాబుతో హోం శాఖ మంత్రి అనిత మాట్లాడారు. ఎంపీడీఓపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
రౌటీషీట్ తెరుస్తాం..
అధికార్లపైనే కాదు. ఎవరిపై అయిన సరే. దౌర్జన్యాలు, రౌడీయిజం ప్రదర్శిస్తే, రౌడీషీట్లు తెరుస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అధికారులు, సామాన్యులపై వైసీపీ నాయకుల దాడి. వారి ఆధిపత్యం, అహంకారానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిపై పిడి గుద్దులతో విరుచుకుపడిన ఘటనను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ప్రభుత్వం మారినా కడప జిల్లాలో అధికారులు, సామాన్యులపై దాడులు జరుగుతుండడం వైసీపీ నాయకుల అహంకారానికి, ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు.
ఎవరినీ వదలం..
గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించి, అధికారి గొంతుపైనే కాలేసి తొక్కి, నానా దుర్భాషలాడి పిడిగుద్దులతో విచక్షణరహితంగా దారుణంగా ప్రవర్తించిన వారందరినీ వదలమని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఎంపీడీవో జవహర్ బాబుకి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, భద్రత ఏర్పాట్లు చేస్తామని హోంమంత్రి ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి హోంమంత్రి ఫోన్ చేసి ఎంపీడీవోపై దాడి ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రికి జిల్లా ఎస్పీ వివరించారు. మొత్తం 20 మంది వైసీపీ నాయకులు దాడిలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేయడం సహేతుకమైన చర్యకాదని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు పాల్పడిన వారిపై అవసరమైతే రౌడీ షీట్ తెరవడానికీ వెనకాడబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.