మహిళలను గౌరవించే వ్యక్తిగా క్షమాపణ కోరా: కేటీఆర్
మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి కేటీఆర్.. తెలంగాణ మహిళా కమిషన్ ముందు ఈరోజు హాజరయ్యారు. తాను మహిళలను కించపరచాలనో, అవమానించాలనో ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.
మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి కేటీఆర్.. తెలంగాణ మహిళా కమిషన్ ముందు ఈరోజు హాజరయ్యారు. తాను మహిళలను కించపరచాలనో, అవమానించాలనో ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తనవి ఏదో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవని కావంటూ చెప్పుకొచ్చారు. మహిళలను తాను ఎంతో గౌరవిస్తానని, అలాంటి తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించి ఇంత పెద్ద ఇష్యూ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధ్యతగల పౌరుడిగా మహిళా కమిషన్ ముందు హాజరయ్యానని చెప్పారు. మహిళలను గౌరవించే వ్యక్తిగా ఆనాడు తాను మాట దొర్లటంపై క్షమాపణ కోరానని తెలిపారు.
కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నా..
‘‘చట్టాన్ని గౌరవిస్తూ నేను కమిషన్ ముందు హాజరయ్యాను. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు మా నాయకులపై దాడి చేశారు. దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలను గౌరవించాలన్న ఉద్దేశంతో మేము వస్తే మాపై దాడి చేయడం సరికాదు’’ అని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం మారిన 8 నెలల్లో మహిళలపై జరిగిన సంఘటనలను కమిషన్‌కు వివరించే ప్రయత్నం చేశా. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకొచ్చాను. మళ్ళీ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. తప్పకుండా వస్తానని చెప్పాను. ఏది ఏమైనా మా నాయకురాళ్లపై దాడి చేయడం సమంజసం కాదు. మా నాయకురాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
అసలేమైందంటే..
ఆగస్టు 15న తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన బీఆర్ఎన్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. "బస్సుల్లో అల్లం, వెల్లిపాయాలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు. అందుకే బస్సులు పెట్టరేమో మాకు తెలియదక్కా. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడడం లేదా. ఒక్కో మనిషికి ఒక్కో బస్సు పెట్టండి. బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డ్ డాన్స్ లు వేసుకోమనండి... మాకేంటి? అదనంగా బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దాంతో ఈరోజు ఆయన కమిషన్ ముందు హాజరైన తన వ్యాఖ్యలను వివరణ ఇచ్చుకున్నారు.