కుప్పిగంతుల ‘అవంతి'.. జనసేనలోకి జంప్ చేస్తారా ?

ముచ్చటగా మూడు పార్టీలు మారిన ముత్తంశెట్టి. ప్రజారాజ్యంతో రాజకీయ ప్రస్థానం. ఆపై టీడీపీ, వైసీపీల్లోకి. ఇప్పుడు వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి.

Update: 2024-12-12 11:59 GMT

రాజకీయ నాయకులు అధికారం ఉన్నంత కాలం పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. అధినేతను ఆహా.. ఓహో అంటూ ఆకాశానికెత్తేస్తారు. అధికారం పోగానే పక్క చూపులు చూస్తారు. పార్టీని వీడాలనుకున్న కొందరు ఇన్నాళ్లూ పొగడ్తలతో ముంచెత్తిన అధినాయకుడిని దుమ్మెత్తి పోస్తారు. పవర్లోకి వచ్చిన పార్టీలోకి జంప్ చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటారు. వ్యక్తిగత కారణాలనో, మరే వంకలనో చూపుతూ సొంత పార్టీకి గుడ్బై చెబుతారు. కొన్నాళ్లకు అధికారంలో ఉన్న పార్టీలో చేరిపోతారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి జారిపోతున్నారు. తాజాగా ఆ కోవలోకే వచ్చారు మాజీ మంత్రి, విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. కొన్నాళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించినట్టు తెలిపారు.

జగన్పై అవంతి విమర్శలు..

ఇన్నాళ్లూ వైఎస్ జగన్ దేవుడు, రాముడు అంటూ ఆకాశానికి ఎత్తిన అవంతి.. వైసీపీని వీడినట్టు ప్రకటించాక స్వరం మార్చారు. పార్టీని వదిలి వెళ్లిపోతున్న నాయకుల మాదిరిగానే ఆయన కూడా జగన్పై విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలి. ఐదేళ్లు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పిచ్చారు. కనీసం ఒక సంవత్సరమైనా కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. పాలన ఐదు నెలలైనా చూడకుండా ధర్నాలు చేయమంటే ఎలా? బ్రిటిష్ వారు లండన్లో నిర్ణయాలు తీసుకుని ఇక్కడ అమలు చేసేవారు. బ్రిటిషర్ల మాదిరిగానే తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్) ఆదేశాలిస్తారు. ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీలో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడ్డారు.. నలిగి పోయారు. అధినేత ఇప్పటికీ మీటింగ్లు పెట్టి సమీక్షించుకోకుండా ధర్నాలు చేయమని చెప్పడం మంచి పద్దతి కాదు.. అప్పుడే ఏం కొంపలు అంటుకు పోతున్నాయి? అని విమర్శలు గుప్పించారు. తాను వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, భీమిలి ఇన్చార్జి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మీడియాకు వివరించారు.

ముచ్చటగా మూడు పార్టీలు మారి..

చాలామంది రాజకీయ నాయకుల మాదిరిగానే అవంతి శ్రీనివాస్ కూడా అవకాశ వాద రాజకీయాలకే ప్రాధాన్యమిస్తారని మరోసారి నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అవంతి విద్యాసంస్థలను నడుపుతున్న ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి రావడం ద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఆ పార్టీ తరఫున భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యాక 2014లో టీడీపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్బై చెప్పేసి వైసీపీలో చేరారు. వస్తూ వస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మళ్లీ భీమిలి అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అవంతికి క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కింది. రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవి పోయింది. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ తరఫున భీమిలి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఉన్నట్టుండి గురువారం ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అవంతి జనసేనలో చేరతారా?

వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్.. తాను ఏ పార్టీలో చేరతారో వెల్లడించలేదు. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినా త్వరలో జనసేనలో చేరతారని తెలుస్తోంది. ఎందుకంటే.. టీడీపీ నుంచి వైసీపీలో చేరాక ఆయన చంద్రబాబుపై పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. అవహేళన చేస్తూ మాట్లాడారు. పైగా ఒకప్పటి మిత్రులుగా ఉన్న ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై కూడా ఆరోపణలు గుప్పించారు. దీంతో చాన్నాళ్ల నుంచి వీరిద్దరూ ఉప్పు, నిప్పులా ఉన్నారు. ఇలా టీడీపీలో ఆయనకు అంతగా సానుకూలత లేదు. దీంతో ఇప్పుడాయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు చెబుతున్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయాలతో ఆయన పావులు కదిపి జనసేనలో చేరికకు మార్గం సుగమం చేసుకున్నట్టు తెలిసింది. జనసేనలో చేరడం ద్వారా కూటమి ప్రభుత్వంలో తనకు కావలసిన పనులు చేయించుకోవచ్చన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది.

వైసీపీలో ఉండగా ఆరోపణలు..

వైసీపీలో ఉండగా అవంతి శ్రీనివాస్పై ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. తన నోటి దురుసుతనంతో పార్టీ క్యాడర్ నే కాదు.. అధికారులపై కూడా నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటు. ఇలా తరచూ అధికారుల పట్ల దురుసు ప్రవర్తనతో వివాదాస్పదుడయ్యారు. అంతేకాదు.. వైసీపీలో పార్టీ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడినట్టు వచ్చిన ఆడియోలు ఆయనను తీవ్రంగా ఇబ్బందికి గురిచేశాయి. ఈ ఆడియో రికార్డులు మీడియాలోనూ, సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్నే రేపి ఇరుకున పెట్టాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ ఆడియో రికార్డులు బయటకొచ్చిన కొన్నాళ్లకే అవంతి మంత్రి పదవి కూడా ఎగిరి పోయింది. ఈ ఆడియో రికార్డులే ఆయన అమాత్య పదవిని హరించి వేశాయని అప్పట్లో ప్రచారం జరిగింది.

Tags:    

Similar News