పులివెందులలో వైఎస్సార్ సీపీ పట్టు తప్పుతోందా?

పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల టీడీపీ ప్రాబల్యం పెరుగుతోంది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పట్టు సాధించి తమ బలం పెరుగుతోందని నిరూపించారు.;

Update: 2024-12-16 06:00 GMT

సాగునీటి వినియోగ దారుల సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకుంది. దాదాపు 40 సంవత్సరాల తరువాత నియోజవకర్గంలోని అన్ని సాగునీటి వినియోగ దారుల సంఘాలు ఏకగ్రీవం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పులివెందుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. బిటెక్ రవి అధికార పార్టీలో పులివెందుల నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండటంతో అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకోగలిగారు. పులివెందుల నియోజకవర్గ వ్యవహారాలు ఎక్కువగా కడప పార్లమెంట్ సభ్యలు, వైఎస్సార్సీపీ నాయకులు అవినాష్ రెడ్డి చూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

టీడీపీ బలపరిచిన వారే సాగునీటి సంఘాలకు ఎన్నికయ్యారు...

పులివెందుల నియోజకవర్గంలోని సాగునీటి వినియోగ దారుల సంఘాలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్సీపీ నుంచి నామినేషన్ లు దాఖలు చేసేందుకు రైతులు ముందుకు రాలేదు. దీంతో కమిటీల ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ వైఎస్సార్సీపీ బలపరిచిన రైతులు ఎవ్వరూ నామినేషన్ లు వేసేందుకు రాలేదు. దీంతో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇన్నేళ్ల కాలంలో ఒక్క సాగునీటి సంఘం కూడా వైఎస్సార్సీపీ బలపరిచిన వారు లేరంటే ఆశ్చర్యంగానే ఉంది.

ఇకపై ఇలాగే ఉంటుంది..

సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బిటెక్ రవి మీడియాతో మాట్లుడుతూ ఇకపై ఇలాగే ఉంటుందన్నారు. గతంలో వైఎస్సార్సీపీ వారు చేసిన పద్దతులనే ఇప్పుడు మేము కూడా పాటిస్తున్నాం. ఈ విధంగానే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం. ఇకపై పులివెందులలో వైఎస్సార్సీపీ నుంచి ఎవ్వరు కూడా పోటీ చేసే సాహసం చేయలేరు. ఇట్లనే చేస్తం. మిమ్మల్ని ముఖ్యమంత్రి కంట్రోల్ చేస్తున్నరు. పులివెందుల నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి తీసుకున్న రోజే కార్యకర్తలు మీసం మెలేసేలా చేస్తానని చెప్పా. ఇప్పుడు అదే చేస్తున్నాన్నారు. మా వాళ్లంతా ఏకగ్రీవం అయ్యారని అవినాష్ రెడ్డి ఏడుపు గొడ్డు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

ఎన్ఓసీలు ఇవ్వకుండా విఆర్ఓలను బంధించారు

ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ విఆర్వోలను సాగునీటి సంఘాల ఎన్నికలకు ముందు రోజే మండల ఆఫీసుకు తరలించారు. వారిని అక్కడి నుంచి కదలకుండా కట్టడి చేశారు. సాగునీటి సంఘాల్లో పోటీ చేయాలంటే వీఆర్వో పొలం పన్నులు చెల్లించిన రసీదులపై ఎన్వోసీలు ఇవ్వాలి. అలా తీసుకోకుంటే నామినేషన్ చెల్లదు. అందువల్ల వీఆర్వోలను ఎన్వోసీలు ఇవ్వకుండా, బిటెక్ రవి ముఠా బయటకు రాకుండా చేశారన్నారు. తనను ఇంట్లో నుంచి కదలకుండా పోలీసులు నిర్బంధించి ఈ విధంగా చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంజాద్ బాషా మాట్లాడుతూ టీడీపీ వారు అరాచకం సృష్టించారు. దౌర్జన్యంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.

వైఎస్సార్సీపీ పట్టు కోల్పోతోందా...

సాగునీటి సంఘాలు అన్నీ వైఎస్సార్సీపీ గుప్పిట్లో ఇప్పటి వరకు ఉన్నాయి. పులివెందులలోని ప్రతీ గ్రామంలో జగన్ కు పట్టు ఉంటుంది. అందుకే మెజార్టీ లక్ష వరకు సాధారణ ఎన్నికల్లో వస్తూనే ఉంది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా మారింది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి కలిసి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ పట్టు పెంచుతున్నారు. బీటెక్ రవి నియోజకవర్గం అంతా తిరుగుతూ గ్రామాల్లో ప్రాబల్యం పెంచుకుంటున్నారు. ఇప్పుడు అధికారం తోడవడంతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ వారిదే పై చేయి అయింది.

నిజానికి కొన్ని గ్రామాల్లో టీడీపీ వాళ్ల జాడ ఉండేది కాదు. కానీ ఆరు నెలలుగా అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి పోటీగా టీడీపీ వర్గం కూడా తయారు అయింది. ఇదే గేమ్ చేంజర్ గా మారుతోంది. జగన్ పులివెందుల వ్యవహారాలను ఎప్పుడూ నేరుగా పట్టించుకోలేదు. ఆయన తరపున అవినాష్ రెడ్డి, ఆయన బంధువులే పెత్తనం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వారి నిర్వాకం వల్లే సాగునీటి సంఘాల్లోనూ పట్టు కోల్పోయారు. ఇప్పుడు స్వయంగా జగన్ జోక్యం చేసుకున్నా ప్రయోజనం ఉండే అవకాశం లేదు.

Tags:    

Similar News