ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం చేతకాని జగన్

భారత ప్రభుత్వం 2025-26 కు ప్రవేశ పెట్టిన బడ్జెట్ స్వరూపం ఎలా ఉందని మాట్లాడే ఆలోచన కూడా వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్ చేయలేదు. కారణం ఏమై ఉంటుంది?;

Update: 2025-02-02 06:12 GMT

ప్రజలు ప్రతిపక్షం వైపు నిత్యం చూస్తూ ఉంటారు. ఎందుకంటే అధికార పక్షం చేస్తున్న అవినీతి, అక్రమాలు, చేతకాని తనం వంటి అంశాలను ఎత్తి చూపిస్తారనే భావన ప్రజల్లో ఉంటుంది. ఒకప్పుడు ప్రతి పక్షం అంటే ప్రభుత్వాన్ని సెండ్ర కోలాతో నడిపించే పార్టీగా పేరు ఉండేది. నేడు ప్రతిపక్షం అంటే కనిపించని ఓ మాయా ప్రపంచమైంది. రాజకీయాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కాదని ప్రజలకు తెలుసు. ఒకరిపై ఒకరు కక్ష తీర్చుకోవడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నేతలు ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎలా వేధించాలనే ఆలోచన అధికార పక్షం చేస్తోంది. అధికార పక్షం కుట్రల నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచన ప్రతిపక్షం చేస్తోంది. నేటి రాజకీయాలు ఇలా మారాయి. ప్రతిపక్ష పార్టీ ప్రతి విషయంలోనూ స్పందించాలి. ఎందుకంటే అధికార పక్షం తాను చేస్తున్న వన్నీ మంచి పనులే అనుకునే అవకాశం ఉంది. అందులో ఈ తప్పులు ఉన్నాయని ఎత్తి చూపించే బాధ్యత ప్రతిపక్షం తీసుకోవాలి.

నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీ పోషిస్తోందా? అంటే అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. కేంద్రంలోని అధికార పక్షానికి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దాసోహం అంటున్నాయి. ఇదెక్కడి విడ్డూరం అనే విమర్శలు ఉన్నప్పటికీ ఏపీలో వైఎస్సార్సీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కిక్కురు మనలేదు. లండన్ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చారు. దేశ భవిష్యత్ ను నిర్ణయించే బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ ప్రభావం దేశ ప్రజల్లో ఏ వర్గాలకు ఎలా ఉంటుదనేది కూడా చెప్పలేదు. ఇందుకేనా ప్రజలు నాయకుడి వెంట ఉండాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధాన నాయకుడు లేడనుకుంటే ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడే అవకాశం ఉండాలి. వారు కూడా మాట్లాడలేదంటే అసలు వైఎస్సార్సీపీ మనుగడ ఉంటుందా? గతంలో మాదిరి ఎన్నో పార్టీలు ఉప్పెనలా వచ్చి సముద్రంలో కొట్టుకు పోయినట్లు పోతుందా? అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

విభజిత ఆంధ్రప్రదేశ్ కు పదేళ్లు నిండి పదకొండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇన్నేళ్లలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల నేతృత్వంలోని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు పరిపాలించాయి. తెలుగుదేశం పార్టీకి గతంలో బీజేపీ తోడైంది. నేడు బీజేపీకి తోడు జనసేన కూడా తోడై మూడు పార్టీల కూటమి ఏర్పడింది. అంటే రాష్ట్రంలో నాలుగు పార్టీలకు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ నాలుగు పార్టీల్లో బీజేపీని పక్కన పెడితే మూడు పార్టీలు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ లోని నేతల కాళ్ల వద్ద ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట ఏపీలో అధికారంలోకి వచ్చినప్పుడు తనకు మెజారిటీ ఉన్నా కేంద్రంలోని బీజేపీకి తన అవసరం లేకుండా పోయింది. అందుకే నేనేమీ చేయలేకపోతున్నానని చాలా సార్లు బాధను వ్యక్తం చేశారు. అప్పుడు సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. అంత మాత్రాన ప్రజల మద్దతు ఉన్న పార్టీగా స్పందించాల్సిన అవసరం లేదంటారా? కనీసం స్పందించడం కూడా చేతకాకపోతే ఆ పార్టీ కోసం ఎందుకు కార్యకర్తలు పనిచేయాలనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి.

దేశానికి దశ, దిశ నిర్దేశించే బడ్జెట్ పై జగన్ మాట మాట్లాడలేదంటే తప్పకుండా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది స్పష్టమవుతోంది. తాను కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలోని సర్కార్ పై నోరు మెదపడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాస్త హార్స్ గా వ్యవహరిస్తే తనకు ఇచ్చిన బెయిల్ ను ప్రభుత్వం రద్దు చేయిస్తుందేమోనన్న భయం జగన్ లో ఉందనేది స్పష్టమవుతోంది. ఇటువంటి నాయకులతో ప్రజలు ఎలా బతకాలి. భవిష్యత్ పై ఎన్నో ఆశలతో అడుగులు వేయాల్సిన రాష్ట్రం అప్పుల పాలు కావడమే కాకుండా కేంద్ర పాలకుల వద్ద జగన్ వంటి నేతలు బానిసలుగా ఉండేందుకు కూడా వెనుకాడని పరిస్థితికి వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ప్రధాన మంత్రి మోదీ కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆయన వారించి జగన్ ను పైకి లేపారు. ఇదంతా ప్రపంచం చూసింది. ఇలాంటి నాయకులా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లడానికి ఉచిత పథకాలు కారణం. ఉచితంగా తమకు డబ్బులు ఇవ్వాలని ప్రజలు కోరుకోలేదు. ఇస్తామంటే వద్దనటం లేదు. అప్పులు తెచ్చి ఉచితంగా ప్రజలకు డబ్బులు పంచి రాష్ట్రాన్ని అప్పులు ఇచ్చిన వారికి తాకట్టు పెట్టడంలో జగన్ ముందున్నారు. ఆ తరువాత వరుసలో చంద్రబాబు ఉన్నారు. వీరిద్దరూ రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రంలోని పెద్దలకు తాకట్టు పెట్టి స్వప్రయోజనాలు కాపాడుకుంటున్నారనే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

Tags:    

Similar News