జగన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు

గతంలో కూడా ఓ యువతిని ట్రోల్‌ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అన్నారు.;

Update: 2025-02-21 08:36 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఓ ఐదేళ్ల చిన్నారి సెల్పీ దిగితే దానిని ట్రోల్‌ చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత దారుణంగా చేస్తున్న ఈ ట్రోలింగ్‌ల సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లకు కనిపించడం లేదా? వీటిని ఎందుకు ఖండించడం లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను ఆయన ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న అభిమానం, ప్రేమతో ఆ పసిపాప ఆయన దగ్గరకు వెళ్లి సెల్పీ దిగితే ఆ పాప తల్లిదండ్రుల పేర్లు, ఆ పాప పేరు, వారి కులాన్ని పెట్టి దారుణంగా ట్రోలింగ్‌లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినే విధంగా ట్రోలింగ్‌లకు పాల్పడటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

గతంలో కూడా టీడీపీ శ్రేణులు ఇలాంటి ట్రోలింగ్‌లకే పాల్పడిందన్నారు. గుంటూరు జల్లా తెనాలికి చెందిన ఓ యువతి జగనన్న కాలనీ ద్వారా తమకు ఓ ఇల్లు సమకూరిందని నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడినందుకు ఆమెపై అతి దారుణంగా ట్రోలింగ్‌లకు పాల్పడ్డారని, వీరి ట్రోలింగ్‌ల కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని అనంత వెంకటరామిరెడ్డి వెల్లడించారు. ఏడాదిన్నర క్రితం 2023 సెప్టెంబరులో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. నాడు ఆ యువతి మీద చేసిన అలాంటి ట్రోలింగ్‌లే ఇప్పుడు ఈ పాపపై చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పసిపాప జగన్‌ను కలిస్తే విపరీతంగా ట్రోల్‌ చేçయడం, ఆ పాప మీద, వారి తల్లిదండ్రులపైన విషం చిమ్మడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
ప్రజల్లో జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేక పోతోందన్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి భద్రతను కుదించిందని మండిపడ్డారు. ప్రజల్లో తిరగ కుండా చేసేందుకే జగన్‌కు భద్రత కుదించే కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారని, రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్‌ యాక్టివిటీనా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇలా మట్లాడటం దుర్మార్గమని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించిందని, కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శలు గుప్పించారు.
Tags:    

Similar News