జగన్, విజయసాయి మధ్య పెరిగిన అగాధం
విలువలు, విశ్వసనీయత గురించి జగన్, సాయిరెడ్డి లు ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.;
Byline : G.P Venkateswarlu
Update: 2025-02-07 10:06 GMT
వైఎస్‌ఆర్ కుటుంబంతో 40 ఏళ్ల అనుబంధం తెగిందో, తెగలేదో వైఎస్సార్‌సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి తెలుసు. మాజీ సీఎం జగన్ మాత్రం తెగిందనే సంకేతాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో విజయసారెడ్డిపై మొదటి కేసు నమోదైంది. ఇప్పటి మాత్రం ఇదే. ఇంకా ఉన్నాయో లేవో తెలియదు. మద్యం కేసులో కూడా విజయసాయిపై కేసు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీని వదిలేయడం వెనుక ఏమి జరిగిందనేది ఎవ్వరికీ ఇంతవరకు తెలియదు. వారి సన్నిహితులకు తెలిసినా బయటకు మాత్రం పొక్కనివ్వలేదు.
ఎక్స్ వేదికగా రాజీనామా ప్రకటించడం ఏమిటి?
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుల, వైఎస్సార్‌సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో పైకి వెల్లడించినా వారిద్దరి మధ్య తీవ్ర అగాధం నెలకొన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తనతో పాటు పార్డీ అండగా ఉంటుందని రాజీనామా చేయొద్దని విజయసాయిరెడ్డికి జగన్‌మోహన్‌రెడ్డి సూచించినా ఆయన మాటలను పట్టించుకోకుండా ముందుగా నిర్ణయించుకున్నట్లే ముందుకెళ్లారు. వైఎస్సార్‌సీపీలో ఇన్నాళ్లూ నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా పార్టీకి ఎందుకు దూరమయ్యారనేది అంతుచిక్కని సమస్యగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ హఠాత్పరిణామాన్ని కేడర్ నమ్మకపోయినా జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల మధ్య మనస్పర్థలు ముదిరి పాకాన పడ్డాయని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ ఒకరిపై మరొకరులు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. విజయసాయిరెడ్డి ఇటు రాజ్యసభ సభ్యత్వానికి అటు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి జనవరి 25న దిలీల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. తన లాంటి వెయ్యి మంది పార్టీ వీడినా ఆయనకు ప్రజాదరణ తగ్గదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను పార్టీకి న్యాయం చేయలేనని, అందుకే రాజ్యసభ పదవి, పార్టీ పదవులకు రాజీనామా చేశానని ప్రకటించారు. అంతేకాదు అంతకు ముందు రోజు అంటే జనవరి 24న ఎక్స్ వేదికగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదని వెల్లడించారు.
విశ్వసనీయతకు అర్థం తెలియని విజయసాయి
జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మా రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డి తో కలిపితే పోయింది నలుగురు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి. మనంతట మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏంటి? సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే. వైఎస్సార్‌సీపీ ఈ రోజు ఉందీ అంటే వారి వల్ల కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే ఉంది అని జగన్ అన్నారు.
నేను క్యారెక్టర్ ఉన్న వాడిని..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు లోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా అని పేర్కొన్నారు. భయం లేదు, ప్రలోభాలు లేవు, విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉందని స్పష్టమైంది. అటువంటప్పుడు పార్టీని ఎందుకు వదిలారనేది చర్చగా మారింది. పదేళ్లుగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయి మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందనే చర్చ కూడా మొదలైంది.
షర్మిలను ఎందుకు కలిసినట్లు
విజయసాయిరెడ్డి ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి మాట్లాడారు. ఏమి మాట్లాడారు. ఎందుకు కలిసారు అనే విషయాలు బయటకు రాలేదు. అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి విమర్శలు గుప్పిస్తున్న షర్మిలను వైఎస్‌ఆర్‌సీపీ వదిలేయగానే ఎందుకు లిసారనే విషయంలోనూ పలు సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకు ఇంతవరకు సమాధానం రాలేదు. షర్మిలను కలిసిన తరువాత ఎక్స్ వేదికగా స్పందించడం కానీ, విలేకరులతో మాట్లాడటం కానీ చేయలేదు.