వైఎస్సార్ సీపీ క్యాడర్ విలవిల
కార్యకర్తల్లో రాజీనామాలపై చర్చ మొదలైంది. నాయకుడి మాట ఏమిటనే దానికోసం ఎదురు చూస్తున్నారు.;
నాయకుడిని, నాయకుడి బలాన్ని చూసి వెనుకున్న క్యాడర్ ఎదురు నిలవాలో.. వద్దో తేల్చుకుంటారు. ఇంత వరకు నాయకుడు నోరు మెదపలేదు. పార్టీలో పదవుల్లో ఉన్న వారిలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి వెళుతున్నారు. పార్టీని నమ్ముకుని అన్నీ తామే అనుకుని గ్రామాల్లో రొమ్ము విరిచి ప్రత్యర్థి పార్టీకి సవాలు విసిరిన తమ్ముళ్లు, చెల్లెళ్ల పరిస్థితి ఏమిటనేది ఒక్క క్షణమైనా ఆలోచించారా? కాలు నొస్తే పార్టీని వదిలేస్తారా? కన్ను నొస్తే పార్టీని కంటితో చూడలేరా? ఆస్తుల కోసం అర్రులు చాస్తారా? అరెస్ట్ చేస్తామంటే భయపడతారా? అలుపెరుగని అవినీతి చేసినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? అప్పుడు ఇవన్నీ గర్తుకు రాలేదా? చేసిన తప్పులకు చట్టాల్లోని లొసుగులు కూడా పనిచేయడం లేదా? అందుకే వెళ్లి పోతున్నారా? అనే ఆవేదన వైఎస్సార్ సీపీ క్యాడర్ లో బలంగా వినిపిస్తోంది.
సినిమా హీరోలను చూసి చొక్కాలు చించు కోవడం, వారు ఏ డ్రెస్ లు వేస్తే అవే డ్రెస్ లు వేసుకుని తిరగటం, వారు చేసిన వెకిలి చేష్టలు చేసి అవే గొప్పగా భావించడం నేటి యువతరానికి బాగా అలవాటైంది. ఎందుకంటే వారే చేస్తారు కాబట్టి. ఇటీవల రాజకీయ నాయకులను ఇమిటేడ్ చేయడం, వారు ధరించినట్లే తెల్ల బట్టలు గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకుని వేసుకోవడం. కుర్చీల్లో నాయకులు వెనుకకు ఆనుకున్నప్పుడు చొక్కాకు మడతలు పడితే అవే రాజకీయ నాకుడి గొప్పగా కార్యకర్తలు భావించడం, నా చొక్కా కూడా అలాగే పెద్దపెద్ద మడతలు పడాలని కోరుకోవడం, మడతలు పడ్డప్పుడు చూసుకొని ఆనందించడం పార్టీ క్యాడర్ లోని యువతరానికి అలవాటుగా మారింది. నాయకుడి అలవాట్లు తెలుసుకుని వాటిని ఫాలో కావడం, టీ, స్నాక్స్ నుంచి లంచ్, డిన్నర్ వరకు నాయకుడి ఇంట్లో ఎలా తయారు చేస్తున్నారో చూసి ఇదిగో ఇలా వండి పెట్టాలని ఇంట్లో వారిని వేధించడం, ఈ అలవాట్లు నీకెట్టా వచ్చాయిరా..? అంటూ అమ్మ.. నాన్నలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.
మరి ఈ క్యాడరంతా ఏమి కావాలి. ఎటు వైపు దోవ చూసుకోవాలి. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారు. పార్టీలో ఏమి జరుగుతోంది. నాయకుల పరిస్థితి ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు. వారికి కావాల్సింది ఏమిటి? పార్టీ వారికి కావాల్సిన వాటిని అందించ గలదా? లేదా? అనే విషయాల్లో స్పష్టత ఇస్తే సమస్యలు రావు. ఎప్పుడో ఒక రోజు ఒక సమావేశం పెట్టి నాయకులకు నాలుగు మాటలు చెప్పి నేను చెప్పింది ఎంతో గొప్పగా ఉంది. ఆ మాటలు కార్యకర్తలకు చెబితే సరిపోతుందని అనుకుంటే అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం అవుతుందా? అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది.
జగన్ తరువాత విజయసాయిరెడ్డి ముఖ్యమైన నాయకుల్లో ఒకరని భావించిన ఆయన వెంటన నిలిచిన క్యాడర్ నేడు విలవిల్లాడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు గతంలో ఇన్ చార్జ్ గా పనిచేసిన సాయిరెడ్డిని తిరిగి ఇటీవలే జగన్ నియమించారు. గతంలో విజయసాయికి అండగా నిలిచిన క్యాడర్ ను పిలిపించి, వారికి భరోసా ఇచ్చి ముందుకు నడిపించేందుకు చర్యలు చేపట్టారు. పార్టీకి అండగా ఉండండి, మీ ఖర్చుల వ్యవహారం నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాస్త ఊపు వచ్చింది. గతంలో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన సందర్భంలోనూ విజయసాయి అక్కడ తనకంటూ కొంత క్యాడర్ ను తయారు చేసుకున్నారు. వారిలోనూ నిర్వేదం నెలకొంది.
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా నిర్వహించే క్యాడర్ భయం గుప్పెట ఉంది. వారిలో ఆ భయాన్ని పోగొట్టేందుకు, వారిలో మనో ధైర్యాన్ని నింపేందుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. తప్పుడు పోస్టులు పెట్టాలని చెప్పినంత తేలిగ్గా కేసుల నుంచి తప్పించడం చేతకావటం లేదు. గత ఐదేళ్ల కాలంలో క్యాడర్ తమకు నామినేషన్ వర్కులు వస్తాయని భావించారు. తాను అధికారంలోకి రాక ముందు అవే మాటలు జగన్ చెప్పారు. అందుకే ఆశతో ఎదురు చూశారు. చివరకు వారికి నామినేషన్ వర్కుల మాట అలా ఉంచితే.. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కేసులు పెట్టకుండా ఉంటే చాలనే ధోరణికి వచ్చారు.
బటన్ నొక్కితే ఓట్లు వస్తాయనుకుని జగన్ బోల్తా పడ్డారనే విమర్శలు ఉన్నాయి. అవి తప్పుడు విమర్శలని కాదు, బటన్ నొక్కడంతో పాటు క్యాడర్ కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టాలి. అలాంటివేమీ లేవు. కనీసం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వకుండా వెల్లికిలా పడిపోయేలా చేశారు. ఇలాంటి పరిస్థిత్లో క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితిని ఇప్పుడు తీసుకొచ్చారు పార్టీ నేతలు. వైఎస్ జగన్ రాగానే క్యాడర్ లో ఎటువంటి ధైర్యాన్ని నింపుతారు? ఆయన పయనం ఏ విధంగా ఉంటుందనే చర్చ మొదలైంది. జనవరి నుంచి నా పర్యటన ఉంటుందని చెప్పిన జగన్ జనవరి ముగుస్తున్నా మళ్లీ ఆ విషయం ప్రస్తావించలేదు.
చివరగా వైఎస్సార్ సీపీలో క్యాడర్ నిలుస్తుందా? లేదా? అనే చర్చ కూడా మొదలైంది. నాయకులు ఒక్కొక్కరుగా పోతుంటే కార్యకర్తలు ఎలా నిలబడతారనే చర్చ మొదలైంది. పేదలకు ఎంతో కొంత సాయం జగన్ అందించారు కాబట్టి వారైనా ఆయన వెంట ఇప్పటి వరకు ఉన్నారు. ఇకపై ఉంటారో లేదో తేలాలి. 41 శాతం ఉన్న ఓటర్లు రానున్న రోజుల్లో ఎన్ని ఇంకా కిందకు పడిపోతారా? పైకి ఎక్కుతారా? వేచి చూడాల్సిందే.