అన్వర్ ఎల్‌డీఎఫ్‌కు దూరమయ్యారా? సీఎంపై విమర్శలకు కారణమేంటి?
ఎల్‌డీఎఫ్‌తో తెగతెంపులు చేసుకున్నా.. ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. మిగిలిన పదవీకాలాన్ని పేదల కోసం వినియోగిస్తా.. ఎమ్మెల్యే పివి అన్వర్
కేరళలోని నిలంబూర్ స్వతంత్ర లెఫ్ట్ ఎమ్మెల్యే పివి అన్వర్ ఎల్‌డీఎఫ్‌తో సంబంధాలు తెంచుకున్నట్టేనా అన్న అనుమానం కలుగుతోంది. గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చే విలువైన ఆభరణాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు పోలీసులు సరైన విధానాన్ని అనుసరించడం లేదని, గతంలో స్వాధీనం చేసుకున్న సుమారు 180 బంగారు స్మగ్లింగ్ కేసులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్వర్ డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న కేరళ సీఎం పినరయి విజయన్.. హోం శాఖ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిలంబూర్ స్వతంత్ర లెఫ్ట్ ఎమ్మెల్యే పివి అన్వర్ డిమాండ్ చేశారు. గతంలో ఎడిజిపి ఎంఆర్ అజిత్‌కుమార్, సీఎం రాజకీయ కార్యదర్శి పి.శశిపై తాను చేసిన పలు ఆరోపణలు, ఫిర్యాదులకు సంబంధించి.. ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించారు.
రియాస్‌పై కూడా..
బంగారం స్మగ్లింగ్ కేసుల విచారణ సరిగా జరగడం లేదని, కొన్ని కేసుల ఎంక్వయిరీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతోందని అన్వర్ ఆరోపించారు. పట్టుబడ్డ వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారంలో కొంత బంగారాన్ని పోలీసులు ఎలా "స్వైప్" చేసారో వీడియోలను కూడా చూపించానని అన్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలకు దిగిన అన్వర్ తన అల్లుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్‌ను కూడా వదలలేదు. రియాస్ అవకాశాలను మెరుగుపరిచేందుకు పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షంపై కూడా రాష్ట్రంలోని అధికార సీపీఐ(ఎం)తో అనుబంధం ఉందని అన్వర్ ఆరోపించారు. అందుకే పార్టీ నేతలకు సంబంధించిన అనేక కేసులు పరిష్కారం కావడం లేదని.. అందుకే నేను లేవనెత్తిన అంశాలను ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదని అన్నారు.
మిగిలిన పదవీ కాలం పేదల కోసం..
ఎల్‌డీఎఫ్‌తో తెగతెంపులు చేసుకున్నా.. ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అన్వర్ స్పష్టం చేశారు. మిగిలిన తన పదవీకాలాన్ని పేదల కోసం వినియోగిస్తానని చెప్పారు. పార్టీ ఒత్తిడి చేసినా తాను రాజీనామా చేయనని ప్రకటించారు. కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు అన్వర్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. గాంధీ కుటుంబం పట్ల తనకున్న గౌరవం, సెంటిమెంట్ ఎప్పుడూ మారదని పేర్కొ్న్నారు. తన భవిష్యత్తు కార్యాచరణకు ప్రకటించేందుకు ఆదివారం నిలంబూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.