అన్నామలై అవుట్, EPS ఇన్: 2026 కోసం BJP వ్యూహాత్మక వ్యూహం?
ఇటీవల అమిత్ షాను కలిసిన ఏఐఏడీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి - రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ చీఫ్.;
2026 అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో తమిళనాట(Tamil Nadu) రాజకీయ వాతావరణం క్రమేణా వేడెక్కుతోంది. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనది తమిళనాడు నాయకత్వ రేసు నుంచి బీజేపీకి చెందిన కె అన్నామలై తప్పుకోవడం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు. ఏఐఏడీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి(EPS) ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అన్నామలై ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ భవిష్యత్తు గురించి ‘టాకింగ్ విత్ శ్రీని కార్యక్రమంలో ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
"డీఎంకే(DMK) పాలనకు వ్యతిరేకంగా అన్నామలై పోరాటం తమిళనాట బీజేపీకి ఊపిరి పోసింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా తీర్చిదిద్దారు. అయితే ఏఐఏడీఎంకేతో సంకీర్ణ రాజకీయాలు.. అన్నామలై పొలిటికల్ కెరీరీకు ఆటంకంగా మారాయి, " అని పేర్కొన్నారు.
అయితే ఏఐఏడీఎంకే(AIADMK) నేతల గురించి అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ షేర్‌ను 11.24%కి పెంచినా, ఆశించిన స్థానాలు విజయం సాధించడంలో విఫలమయ్యారు.
పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగం..
"2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే.. EPS నాయకత్వంలో ముందుకు సాగాలని ఢిల్లీలోని BJP అధినాయకత్వం గ్రహించింది. తమిళనాడులోని అగ్రవర్ణ ఓటర్లు, యువత నుంచి అన్నామలైకి సంపూర్ణ మద్దతు ఉన్నా.. పార్టీ నాయకత్వ మార్పుపై పునఃపరిశీలించడం తప్ప వేరే మార్గం లేదు," అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. అన్నామలైని పక్కక పెట్టడం పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగమేనని చెప్పారు.
తమిళనాడు సంక్లిష్ట రాజకీయాల్లో నటుడు విజయ్ టీవీకే పేరున పార్టీ ఏర్పాటు, డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వడానికి పార్టీ చీఫ్ ఎంపికలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
అందరి దృష్టి అన్నామలై వారసుడిపైనే ..
అన్నామలై(Annamalai) తర్వాత ఆయన వారసుడెవరనే దానిపైనే తమిళనాట పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న నైనార్ నాగేంద్రన్ పేరు బలంగా వినిపిస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈపీఎస్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉండడమే అందుకు కారణం. కొంగు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ సహా మరికొంత నాయకుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వానతి కూడా బలమైన అభ్యర్థే అయినప్పటికీ, ఈపీఎస్‌తో దగ్గర సంబంధాలున్న వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది.
మొత్తం మీద రానున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఒకవైపు ఏఐఏడీఎంకే, బీజేపీ మరోవైపు డీఎంకే, కాంగ్రెస్, ఇంకోవైపు టీవీకే మధ్య తీవ్ర పోరు ఉండబోతుంది.