కడప పార్లమెంటు స్థానానికి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి తలపడుతుండగా.. వైసీపీ నుంచి భారతి మేనమామ కుమారుడైన వైఎస్ అవినాష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిపై షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. షర్మిలకు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఐ, సీపీఎం మద్దతు పలికాయి. సీపీఐ నేతలు .. షర్మిల తో కలిసి ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఓసారి పర్యటించిన ఆమె రాష్ట్రంలో ప్రచారానికి పీసీసీ అధ్యక్షురాలి హోదాలో వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మే నెల 1న తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకుని పోలింగ్ పూర్తయ్యేవరకు ఇక్కడే మకాం వేయాలని నిర్ణయించారు. షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేర్వేరు సమయాల్లో రానున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సునీత ఊరూవాడా ప్రచారం చేస్తుండగా, తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ శనివారం నుంచి రంగంలోకి దిగారు.
బ్రదర్ అనిల్ ప్రచారం ఎలా సాగుతుందంటే...
క్రైస్తవ మత ప్రబోధకునిగా మంచిపేరున్న బ్రదర్ అనిల్ 2019 ఎన్నికల్లో తన బావ జగన్ కు మద్దతుగా మూడో కంటికి తెలియకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ కు క్రిస్టియన్ల నుంచి మద్దతు కూడగట్టారు. ఇప్పుడు ఆయనే తన బావ జగన్ కు వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేలా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వైయస్‌ఆర్ జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన.. ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. తన పార్టీ ఓట్లు చీలి పోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్ బహిరంగంగా విమర్శలు చేశారు. సీఎం అనుమానాలు నిజం చేసేవిధంగా బ్రదర్ అనిల్‌కుమార్ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ప్రొద్దుటూరులో శనివారం ఆయన పాస్టర్లతో సమావేశమై బ్రదర్ అనిల్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా కోరారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ.. పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరడం వినిపించింది. కడపలో జరిగిన ఓ చర్చిలో బోధనలు చేస్తూ.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు. మా కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. న్యాయం జరగాలని, జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ప్రసంగించారు బ్రదర్ అనిల్.
రంగంలోకి దిగిన భారతి...
తన భర్త జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో మునిగితేలుతుంటే ఆయన భార్య భారతి తాడేపల్లి నివాసాన్ని వదిలి పులివెందులలో ఇంటింటి ప్రచారానికి దిగారు. ఎటువంటి ప్రత్యక్ష కామెంట్లు చేయకుండా ఆమె ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, తన భర్తను పులివెందులలో, కడప పార్లమెంటు స్థానం నుంచి అవినాశ్ రెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆమెతో పాటు అవినాష్‌రెడ్డి భార్య సమత కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. సమత తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు.
జగన్ పై మండిపడుతున్న సునీత..
ఇక, వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. జగన్ ను ఓడించడం కన్నా అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా సునీత ప్రచారం సాగుతోంది. వైసీపీ కార్యకర్తలు ఆమె ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నా సునీత మాత్రం ఖాతరు చేయకుండా ముందుకుసాగుతున్నారు. వివేకా హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే వారికి ధీటుగా సునీత సమాధానం ఇస్తున్నారు. ఎందుకు వివేకా హత్య గురించి మాట్లాడకూడదంటూ ఎదురుతిరిగి బస్తీమే సవాల్ అంటున్నారు.
ఇన్ని గొడవల మధ్య ఇక్కడ ఉండే కన్నా మనవడి దగ్గరకే వెళ్లడం మంచిదంటూ వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్లారు. వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సుగుణమ్మ మాత్రం హైదరాబాద్, పులివెందులలో ఉంటూ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం పరోక్షంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మొత్తం మీద కడప గడపలో పట్టు ఎవరిదన్న దానిపైన్నే వైఎస్ కుటుంబం హోరాహోరీగా పోరాడుతోంది. సార్వత్రిక ఎన్నికల కన్నా కడప జిల్లాపై పట్టు కోసమే ఈ కుటుంబం కొట్లాడుతున్నట్టుగా ఉందని కడపకుచెందిన సువర్ణరాజు అభిప్రాయపడ్డారు. ఈ పోరులో అటు జగన్ విజయం సాధిస్తారో లేక ఆయన చెల్లెలు షర్మిల పైచేయి సాధిస్తారో మరికొంత కాలంలో తేలనుంది.