అతని దౌత్య పాస్ పోర్టు రద్దు చేయండి: ప్రధానికి, ఆ రాష్ట్ర సీఎం లేఖ

హసన్ ఎంపీ, ప్రజ్వల్ రేవణ్ణ పాస్ పోర్టును వెంటనే రద్దు చేయాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Update: 2024-05-02 07:51 GMT

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను వెంటనే కర్నాటకు రప్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రేవణ్ణ తన దౌత్య పాస్ పోర్టును అంతర్జాతీయ ప్రయాణాలకు వినియోగించుకుంటున్నారని, వెంటనే దానిని రద్దు చేయాలని లేఖ లో డిమాండ్ చేశారు. మోదీకి రాసిన లేఖలో సీఎం సిద్ధరామయ్య " పరారీలో ఉన్న నిందితుడు, పార్లమెంట్ సభ్యుడు త్వరగా భారత్ కు తిరిగి వచ్చేలా చట్టం శక్తిని వాడాలి. అలాగే అంతర్జాతీయ పోలీసులు, ఏజెన్సీలు ఇతర వ్యవస్థలను ఉపయోగించుకోవాలి" అని లేఖలో ప్రధానిని కోరారు.

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన తీవ్ర ఆరోపణలను అర్థం చేసుకున్న మా ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతను దేశం విడిచి వెళ్లిపోయాడని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అందుకోసం ఓ లేఖ రాశానని సిద్ధరామయ్య అన్నారు.

33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ హెచ్‌డి దేవెగౌడ పెద్ద కుమారుడు అయినా హెచ్‌డి రేవణ్ణ కుమారుడు, ఆయన ఎమ్మెల్యే, మాజీ మంత్రి. శుక్రవారం పోలింగ్‌ జరిగిన హాసన్‌ నుంచి బీజేపీ-జేడీ(ఎస్‌) కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్‌ బరిలో నిలిచారు.

స్పష్టమైన క్లిప్‌లు

ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక వీడియోలు ఉన్నాయి. పోలింగ్ జరిగిన శుక్రవారం ఆయన వీడియోలు హసన్ లో హల్ చల్ చేయడం ప్రారంభించాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంపీకి సంబంధించిన నేరాలపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. "పోలీసు కేసు, అరెస్టును పసిగట్టిన నిందితుడు, ఎంపీ రేవణ్ణ ఏప్రిల్ 27న దేశం విడిచి విదేశాలకు వెళ్లాడు. అది కూడా దౌత్య పాస్ పోర్ట్ పై’’ అని సిద్ధరామయ్య లేఖలో ప్రస్తావించారు.

ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది మహిళలపై చేసిన నేరాల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిట్ 24 గంటలు పనిచేస్తోందని, అతన్ని తిరిగి దేశానికి రప్పించడం ఇందులో చాలా ముఖ్యమైన పనని లేఖలో సిద్ధరామయ్య వివరించారు. దేశ చట్టాల ప్రకారం అతను విచారణ ఎదుర్కొంటాడని సీఎం పేర్కొన్నారు.

"ఈ విషయంలో, ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడానికి భారత దౌత్య, పోలీసు మార్గాలను ఉపయోగించాలి. విదేశీ వ్యవహరాలు, హోంమంత్రి శాఖ ఇందుకోసం చొరవ తీసుకోవాలి. అలాగే పరారీలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు తిరిగి దేశంలోకి రావడానికి అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీలు సహకారం తీసుకోవాలి" అని లేఖ లో అభ్యర్థించారు. కర్ణాటక సిట్ అవసరమైన అన్ని వివరాలను అందజేస్తుందని దీనికి సంబంధించి అవసరమైన అన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు.

'భయంకరమైనది.. అవమానకరమైనది'

ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ అసంఖ్యాక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్రమైన కేసు ఉందని పేర్కొన్న సిద్ధరామయ్య, హాసన్ లోక్‌సభకు ఎంపి, ఎన్‌డిఎ అభ్యర్థి ఎదుర్కొంటున్న ఆరోపణలు "భయంకరమైనవి సిగ్గుచేటు" అని, ఇవి దేశ మనస్సాక్షిని కదిలించాయని అన్నారు.

"మా ప్రభుత్వం ఏప్రిల్ 28న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. దర్యాప్తు ప్రారంభమైంది. అనేక మంది మహిళలు ఈ కేసులో బాధితులుగా ఉన్నట్లు తేలింది. అందులో కొంతమంది ఫిర్యాదు చేయడానికి బయటకు వచ్చారు. ఏప్రిల్ 28 న ఎఫ్ఐఆర్ నమోదైంది, ”అన్నారాయన.

Tags:    

Similar News