మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశంపై సీపీఐ(ఎం) వైఖరి మారిందా?
త్వరలో జరగనున్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ నేపథ్యంలో CPI(M) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన..;
కేరళ(Kerala)లోని ట్రావెన్‌కోర్ (Travancore) దేవస్వం బోర్డు సెప్టెంబర్ 20వ తేదీన అయ్యప్ప సంగమం(గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్)నిర్వహిస్తోంది. బోర్డు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా పంబా నది ఒడ్డున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇదిలా ఉండగా..భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం"ఒక ముగిసిన అధ్యాయం" అని అన్నారు. గోవిందన్ మాటలు దివంగత కోడియేరి బాలకృష్ణన్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
సుప్రీం తీర్పుతో CPI(M)లో మార్పు..
10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై ఉన్న నిషేధాన్ని 2018లో సుప్రీంకోర్టు ఎత్తివేసింది. తీర్పునకు కట్టుబడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలోకి వెళ్లే మహిళలకు రక్షణ కూడా కల్పించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో 2019 జనవరిలో బిందు అమ్మిని, కనకదుర్గ ఆలయంలోకి ప్రవేశించినపుడు తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మహిళల ఆలయ ప్రవేశం తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తలు ఆలయశుద్ధిలో పాల్గొన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) 20 స్థానాలకు గాను ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. సాంప్రదాయవాదులు, ముఖ్యంగా హిందూ ఓటర్ల ఇందుకు కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి.
సీపీఐ(ఎం)వైఖరిలో మార్పు..
గతానుభవం దృష్ట్యా సీపీఐ(ఎం)వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 800 మంది భక్తులు వస్తారని సమాచారం.
సాధారణంగా ఆచారాలకు పెద్దగా విలువివ్వని పార్టీ..భక్తుల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించడం పార్టీ వైఖరిలో మార్పునకు సంకేతం.
"మహిళల ప్రవేశానికి మద్దతుగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం మొదట ఇచ్చిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవాలి. హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు మా కార్యకర్తలు, భక్తులపై బనాయించిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి" అని బీజేపీ నాయకురాలు శోభా సురేంద్రన్ డిమాండ్ చేస్తున్నారు.
‘‘అది మెజారిటీ కమ్యూనలిజం’’
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్‌ను "మెజారిటీ కమ్యూనలిజం"గా అభివర్ణించింది. అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, దాని మిత్రపక్షాలు తమ వైఖరిని ఇంకా బయటపెట్టలేదు.
స్వరం పెంచిన స్త్రీవాదులు..
"మహిళల ఆలయ ప్రవేశానికి మద్దతు ఇస్తూ..ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పటికీ అలాగే ఉంది. అధికారికంగా ఉపసంహరించుకునే వరకు అది ప్రభుత్వ వైఖరిగానే ఉంటుంది." అని త్రిస్సూర్‌కు చెందిన స్త్రీవాద న్యాయవాది ఆశా ఉన్నితాన్ అన్నారు. ‘‘పార్టీ తన విధానాలు మార్చుకోవచ్చు. కానీ కోర్టు తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. మహిళలు శబరిమల వెళ్లాలని నిర్ణయించుకుంటే..వారు సహజంగానే రక్షణ కోసం ప్రభుత్వాన్ని కోరతారు. కల్పించకపోతే తిరిగి కోర్టును ఆశ్రయిస్తాం" అని ఆమె అన్నారు.
లింగ సమానత్వంపై ప్రారంభమైన ఈ పోరాటం ఓ సంక్లిష్ట పరిణామం. సీపీఐ(ఎం)లో గోవిందన్ వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా కనిపిస్తున్నాయి. హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేసినవిగా కనిపిస్తున్నాయి. మొత్తంమీద కేరళలో 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీపీఐ(ఎం) ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.