డిలిమిటేషన్ పేరుతో కేంద్రానికి స్టాలిన్ తన బలాన్ని చూపుతున్నారా?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనిపించినా.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది.;

Update: 2025-03-20 12:17 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu) సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ‘డిలిమిటేషన్(Delimitation)’ అంశంపై మార్చి 22న చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గ విభజన రాష్ట్రాలను ఎలా ప్రభావితం చేస్తుంది? జనాభా ప్రాతిపదికన కాకుండా ఇతర మార్గాలున్నాయా? తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఎవరెవరు హాజరవుతున్నారు?

డీఎంకే వర్గాల సమాచారం మేరకు.. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యేందుకు అంగీకరించారు. ఒడిశా బిజు జనతా దళ్ (BJD) ప్రతినిధులు కూడా రానున్నారు. మెకదాటు ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో.. తమిళనాడు బీజేపీ అధినేత కే.అన్నామలై ‘బ్లాక్ ఫ్లాగ్’ నిరసన చేపడతామని హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ హాజరు సందేహాస్పదంగా ఉంది.

పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ.ఏ.ఎస్ శర్మ తదితరులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పంపినా.. ఆయన నుంచి స్పందన రావాల్సి ఉంది.

ఒక ఉద్యమం అవసరం..

నాటి ఎన్టీ రామారావు తరహాలో దక్షిణ రాష్ట్రాల హక్కుల కోసం ఐక్య ఉద్యమం అవసరమని ఈ.ఏ.ఎస్. శర్మ అభిప్రాయపడ్డారు.

"దక్షిణ-ఉత్తర అసమతుల్యత రాజకీయంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. 1983లో ఎన్టీ రామారావు నేతృత్వంలో జరిగిన చర్చలకు నేను హాజరయ్యాను. అప్పుడు ఎన్టీఆర్ రాష్ట్రాల స్వయంపాలన హక్కులను కేంద్రం నుంచి పరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత NDA ప్రభుత్వం, ఇందిరా గాంధీ హయాంలో కంటే ఎక్కువగా ఫెడరలిజానికి వ్యతిరేకంగా ముందుకెళ్తోంది. అందుకే 1980లలో జరిగిన ఉద్యమం మాదిరిగా మరో ఉద్యమం కావాలి." అని వ్యాఖ్యానించారు.

మునుపటి తీర్మానం..

తమిళనాడులో ఈ నెల 5న జరిగిన రాష్ట్ర స్థాయి అఖిలపక్ష సమావేశంలో.. 2026 తర్వాత మరో 30 ఏళ్ల వరకు ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య అలాగే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. తమిళనాడు ప్రస్తుత 7.18% లోక్‌సభ స్థానాల వాటా ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని ఈ తీర్మానం స్పష్టం చేసింది. స్టాలిన్ మాట్లాడుతూ.. “1971 జనగణననే 2026 వరకు డిలిమిటేషన్‌కు ఆధారంగా తీసుకోవాలి. అలాగే లోక్‌సభ సీట్లు పెంచాలని, అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.” అని పేర్కొన్నారు.

ఆర్థిక అసమానతిపై అసంతృప్తి..

"డిలిమిటేషన్ అంశంపై స్టాలిన్ సమావేశం, పార్లమెంటరీ ప్రాతినిధ్యం, కేంద్ర నిధుల కేటాయింపు గురించి కీలక చర్చలకు వేదికగా మారనుంది." అని రాజకీయ విశ్లేషకుడు ఆర్.ఇళంగోవన్ అభిప్రాయపడ్డారు.

"తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించే ఈ సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. బీజేపీ మిత్రపక్షాలైన చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ తప్ప మిగతా రాష్ట్రాలన్నీ కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలకు నిధుల పంపిణీలో తేడా చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా చంద్రబాబు నాయుడి నిశ్శబ్దం వల్ల మళ్లీ విచారించాల్సి వస్తుందేమో." అని వ్యాఖ్యానించారు.

ఫెడరల్ హక్కుల కోసం స్టాలిన్ చేసే పోరాటం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకి మరింత బలంగా ఉపయోగపడే అవకాశముందని ఆయన విశ్లేషించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు..

అంతర్జాతీయ జనాభా పరిశోధన సంస్థ (IIPS)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త టీవీ శేఖర్ మాట్లాడుతూ.. "డిలిమిటేషన్‌ను పూర్తిగా ఆలస్యం చేయకూడదు. అయితే దాని ప్రభావాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది." అని పేర్కొన్నారు.

"ఉత్తరప్రదేశ్ వంటి అధిక జనాభా ఉన్న రాష్ట్రాలలో ఒక్క ఎంపీ 30 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒక ఎంపీకి కేవలం 7-10 లక్షల మంది ప్రజలే ఉంటున్నారు. దక్షిణ రాష్ట్రాల్లో సీట్లు తగ్గించకుండా ఉత్తర రాష్ట్రాలకు అదనపు సీట్లు కేటాయించడం వల్ల పరిష్కారం దొరకవచ్చు." అని సూచించారు.

రాజ్యసభలో మార్పులు?

"లోక్‌సభ స్థానాలకు బదులుగా, రాజ్యసభలో మార్పులు చేసి ఫెడరల్ హక్కులను కాపాడవచ్చు." అని శేఖర్ సూచించారు.

"రాజ్యసభను నేరుగా ప్రజలు ఎన్నుకోవడం జరగదు. ఇది రాష్ట్రాల శాసనసభల ద్వారా ఎంపిక అవుతుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన రాజ్యసభలో 250 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ దీనిని విస్తరించడానికి అవకాశముంది. లోక్‌సభ స్థానాల కంటే రాజ్యసభను రాష్ట్రాల ప్రాతినిధ్య వేదికగా ఉపయోగించుకోవచ్చు." అని శేఖర్ అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News