Dharmasthala: సిట్ వ్యూహాం మార్చుకుందా?

13వ పాయింట్ వద్ద పోలీసు పహారా ఎందుకు?;

Update: 2025-08-08 13:45 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka) రాష్ట్రం ధర్మస్థల(Dharmasthala) సామూహిక ఖననం కేసును దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వ్యూహం మార్చుకుందా? మానవ అవశేషాల కోసం నేత్రావతి నదీ సమీపంలో 13వ పాయింట్ వద్ద తవ్వకాన్ని ఆలస్యం చేయడానికి అదే కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసును లోతుగా పరిశీలించేందుకు కేవలం సమాచారం ఇచ్చేవారిపైనే ఆధారపడకుండా.. సైంటిఫిక్ ఆధారాలతో ముందుకెళ్లాలన్న ఆలోచనలో SIT ఉన్నట్లు తెలుస్తోంది.


మృతుల్లో మైనర్లు కూడా..

తాను ధర్మస్థల ఆలయ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సమయంలో (1999 - 2014 వరకు) ఆలయ పరిసరాల్లో, నదీతీర ప్రాంతంలో చాలా మృతదేహాలను ఖననం చేశానని, అందులో ఎక్కువగా మహిళలు, మైనర్లు ఉన్నారని పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. పశ్చాత్తాప భావన వెంటాడుతుండడంతో ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చి చెబుతున్నానని పోలీసులకు చెప్పాడు. అనంతరం ఈ కేసు దర్యాప్తును కర్ణాటక ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది.


ఫోరెన్సిక్, సైంటిఫిక్ అధికారులతో కలిసి..

వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గతంలో చెప్పిన ఇన్ఫార్మర్..తాజాగా మరికొన్ని ఖననాలపై వివరాలు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం బెల్తంగడి పోలీస్ స్టేషన్‌లో అనుమానితులు, ఫిర్యాదుదారులను సిట్ అధికారులు గంటలపాటు విచారించినట్లు వార్తలొస్తున్నాయి. సమాచారం ఇచ్చేవారిని గుడ్డిగా నమ్మకుండా.. ఫోరెన్సిక్, సైంటిఫిక్ అధికారులను కలుపుకుని దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే 13వ పాయింట్ వద్ద తవ్వకాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.


13వ పాయింట్ వద్ద లోతు ఎక్కువ..

మరోవైపు 13వ పాయింట్ వద్ద మృతదేహాలను పూడ్చిపెట్టిన తర్వాత నదిపై ఆనకట్ట నిర్మించారు. 15 అడుగుల లోతు తవ్వి ఆనకట్ట నిర్మాణం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక దుకాణ యజమాని రమేష్ పూజారి (పేరు మార్చబడింది) ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..‘‘ నా వయసు 70 సంవత్సరాలు. 40 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రదేశం ఇప్పటికే ఎత్తులో పెరిగింది. తవ్వడానికి రోజంతా పట్టవచ్చు. అవశేషాలు చాలా లోతుగా పాతిపెట్టి ఉండొచ్చు’’ అని చెప్పారు.

13 పాయింట్ వద్ద తవ్వకాలు జరపకుండా భూగర్భ అవశేషాలను గుర్తించడానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఉపయోగించే టెక్నిక్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) వ్యవస్థను SIT వాడుకోనుంది. ఈ సాంకేతికత కోసం SIT ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, కేరళలోని ప్రైవేట్ ఏజెన్సీలను సంప్రదించే పనిలో ఉన్నట్లు సమాచారం.

రాబోయే రెండు రోజుల్లో మరో నాలుగు శ్మశాన వాటికలను సిట్ దర్యాప్తు చేయవచ్చని విశ్వసనీయ వర్గాలు ది ఫెడరల్‌కు తెలిపాయి. దీంతో మొత్తం శ్మశాన వాటికల సంఖ్య 17కి పెరుగుతుంది. అయితే ఈ ప్రదేశాలలో తవ్వకాలు ఎప్పుడు మొదలుపెడతారో చెప్పలేదు.

మొత్తం మీద 13వ పాయింట్ వద్ద తవ్వకంపై SIT అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం, అక్కడ టెంట్లు ఏర్పాటు చేసి పోలీసు పహారా ఉంచడంతో ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News