పుస్తక ప్రపంచం పిలుస్తోంది! పోయోద్దాం పదండి!!

అటు చూస్తే బాలల కథలు, ఇటు చూస్తే సైన్స్, టెక్నాలజీ జిలుగులు, మధ్యలో అమరుల స్థూపం, మరోపక్క రవ్వా శ్రీహరి వేదిక.. దానిపై గద్దర్ విశ్వరూపం.. వావ్ ఇది కదా ప్రపంచం

Update: 2024-02-10 05:47 GMT
hyderabad Book fair

హైదరాబాద్.. ఎన్టీఆర్ స్టేడియం.. ప్రజాయుద్ధనౌక గద్దర్‌ ప్రాంగణం.. ఓవైపు తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం. మరోవైపు సంస్కృత పండితుడు రవ్వా శ్రీహరి వేదిక. ఉర్దూ దినపత్రిక సియాసత్‌ మాజీ యండీ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ద్వారం దాటి లోనికి వెళ్లడంతోనే.. మనల్ని మరో ప్రపంచం పిలుస్తుంది.


ఓవైపు అలనాటి వైభవానికి ప్రాభవంగా నిలిచే నిలువెత్తు పుస్తకాలున్న స్టాండ్లు, ఇంకో వైపు తమ కార్యంబును పరిత్యజించియు.. బరార్ద ప్రాపకుల్ సజ్జనుల్ అనే బర్తృహరి గేయాలు, అల్లంత దూరాన మహాకవి శ్రీ.శ్రీ మొదలు ప్రజాకవి కాళోజీ నారాయణ రావు, ఇంకొంచెం దూరాన టాల్ స్టాయ్ బాలల కథలు, యండమూరి వీరేంద్రనాథ్ విజయానికి ఏడు మెట్లు.. ఆ చివర్న పతంజలి సమగ్ర సాహిత్యం, దానిపక్కనే నామిని సుబ్రమణ్యం నాయుడి పచ్చనాకు సాక్షిగా, దాన్ని ఆనుకుని పాకీపిల్ల గురించి కరుణశ్రీ రాసిన గేయం.. ఒక్కో స్టాల్ కి ఒక్కో పేరు.. నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ, పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఇలా ఒక్కో స్టాల్ పై ఒక్కో ప్రచురణ సంస్థ పేరు, మధ్యలో ఓ స్టాల్‌కు ఇటీవల మరణించిన జర్నలిస్టు నర్సింగ్‌ రావు పేరు..

ఇదీ 36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనలో మనకు కనిపించే దృశ్యం. హైదరాబాద్ ఎన్టీఆర్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరింది. లక్షలాదిగా పుస్తక ప్రేమికులు తరలొచ్చే ఈ బుక్‌ ఫెయిర్‌లో 365 స్టాల్స్‌ ఏర్పాటు అయ్యాయి.

పుస్తక ప్రదర్శనంటే మనకు గుర్తొచ్చేవి బుక్స్ అమర్చే స్టాండ్లు, స్టాల్స్, రంగురంగుల చిత్రాలు మన మదిలో మెదులుతాయి. ఇక సాహిత్య సమాలోచనల గురించి చెప్పాల్సిన పనే లేదు. సృజనాత్మకత, కల్పనాలోకంలోకి మనల్ని తీసుకువెళ్లేవే ఈ పుస్తక ప్రదర్శనలు. బుక్ ఫెయిర్ మధ్య మనం నడుస్తున్నప్పుడు ప్రపంచంలో ఇంత సృజనాత్మక ఉత్పత్తి అవుతుందా అనిపిస్తుంది. పుస్తక ప్రదర్శనలు, రచయితలు, ఇలస్ట్రేటర్లు, ప్రచురణకర్తలతో మాటమంతి మనకు ఎన్నెన్నో సరికొత్త విషయాలను తెలియజేస్తాయి. సంప్రదాయ కథల సరిహద్దులను అధిగమించడానికి ఒక ప్రత్యేక వేదికను అందిస్తాయి. ఒక స్టాల్లో నవలా ప్రపంచంలో మునిగిపోతాం. మరో స్టాల్ లో సందర్శకులు పిల్లల పుస్తకంలోని పాత్రలతో సంభాషించవచ్చు.

డిజిటల్ పఠనం పెరుగుదల మధ్య, పుస్తక ప్రదర్శనలు భౌతిక పుస్తకాన్ని పట్టుకోవడంలోని ఆనందాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఇది వ్యక్తిగతంగా మనం మాత్రమే నిజంగా ఆనందించగల అనుభవం.

సరికొత్త శైలి, శోధన, అన్వేషణ, కొంగొత్త రచయితలను కనిపెట్టడానికి, సాహిత్య మాయాజాలాన్ని మళ్లీ పసిగట్టడానికి ఈ ప్రదర్శనలు ప్రేరేపిస్తాయి.

పుస్తక ప్రదర్శనలు కేవలం పుస్తకాలను ఆస్వాదించడానికి మాత్రమే కాదు. అవి ఊహించని ఆనందాలకు నిలయాలు. బుక్ ఫెయిర్‌లు మన జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను గుర్తుచేస్తాయి. డిజిటల్ పుస్తకాలు లేనందున భౌతిక పుస్తకాలు మనల్ని మరెక్కడికో తీసుకువెళతాయి. మనల్ని ఎల్లలు లేని ఊహా, వాస్తవ లోకాల్లోకి తీసుకువెళ్లడానికి ఈ పుస్తక ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడతాయి.

ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంట నుంచి...

మహామహుల సమక్షంలో ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఉంటుంది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. బాలప్రపంచం పేరుతో పిల్లలకు పెయింటింగ్‌, క్విజ్‌, సంగీతం పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం కల్పించారు.

సాహిత్య కార్యక్రమాలు షెడ్యూల్!

ఫిబ్రవరి 10 -గద్దర్‌ యాదిలో..

ఫిబ్రవరి 11 -బాలసాహిత్యంపై సెమినార్‌

ఫిబ్రవరి 12 – దళిత బహుజన తాత్వికత- పరామర్శ

ఫిబ్రవరి 13 – రవ్వా శ్రీహరి రచనలు- విహాంగ వీక్షణం

ఫిబ్రవరి 14 – నేటి నాగరిక పరిణామం- రచయితల స్పందన

ఫిబ్రవరి 15 – సాహిత్య విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాసరావుతో ముఖాముఖి

ఫిబ్రవరి 16 – యువతరం కవుల అంతరంగ ఆవిష్కరణ

ఫిబ్రవరి 17 – కథలోనా పయనం-పెద్దింటి అశోక్‌ కుమార్‌ ముఖాముఖి

ఫిబ్రవరి 18 – నాటకంలో నా ప్రయాణం- శ్రీనివాస్‌తో ముఖాముఖి

ఫిబ్రవరి 19 – పి.శివశంకర్‌ ఆత్మకథ- అదొక్కటే ఏవగింపుపై చర్చాకార్యక్రమం

Tags:    

Similar News