జేడీ(ఎస్) రథసారధి నిఖిల్ కుమారస్వామి?

జేడీ(ఎస్)కు నిఖిల్ కుమారస్వామి సారథ్యం వహించనున్నారా? ఆయన పార్టీకి పూర్వవైభవం తేనున్నారా? పార్టీలో మరింత యాక్టివ్ కాబోతున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది.

Update: 2024-06-16 07:19 GMT

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జేడీ(ఎస్) మాండ్య, కోలార్, హసన్ నియోజకవర్గాల్లో పోటీచేసి మాండ్య, కోలార్  స్థానాలను దక్కించుకుంది. పలువురి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నఆరోపణలతో హసన్ నుంచి పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ ఓడిపోయారు. బాధితుల ఫిర్యాదుమేరకు ప్రజ్వల్‌ను, ప్రజ్వల్ బాధితురాలిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణను అరెస్టు చేశారు. వీరి అరెస్టు పార్టీ మీద ప్రభావం చూపే అవకాశం ఉండడంతో జేడీ(ఎస్) కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఆ స్థానాన్ని ఇప్పటికే జేడీ(ఎస్) యూత్ వింగ్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నిఖిల్ కుమారస్వామితో భర్తీ చేయనున్నట్లు సమాచారం. నిఖిల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి కుమారుడు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు కూడా.

మరింత యాక్టివ్‌గా పనిచేస్తా..

“రాబోయే రోజుల్లో నేను JD(S)లో మరింత చురుకుగా పనిచేస్తాను. రాజకీయం అంటేనే బాధ్యతతో కూడకున్నది. ఇక ప్రాంతీయ పార్టీని నడిపించడం రెట్టింపు బాధ్యత అని ఆయన గురువారం (జూన్ 13) బెంగళూరులో మీడియాతో అన్నారు.

మీరు జెడి(ఎస్)కు రాష్ట్ర అధ్యక్షుడవుతారా? అని అడగగా.. పార్టీ సీనియర్ నేతలయిన తన తాత హెచ్‌డి దేవెగౌడ, తండ్రి హెచ్‌డి కుమారస్వామి నిర్ణయం తీసుకుంటారని సమాధానమిచ్చారు. నిఖిల్ వ్యాఖ్యలను బట్టి పార్టీపై ఆయన పట్టుసాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడు దశాబ్దాలుగా గౌడ కుటుంబానికి పార్టీపై పట్టుంది. ప్రజ్వల్ వ్యవహరంతో రేవణ్ణ కుటుంబం పార్టీ బాధ్యతలను చూసుకునే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిఖిల్‌కే ఆ ఛాన్స్ ఉంది. పార్టీ నాయకత్వ బాధ్యతలను నిఖిల్‌కు అప్పగించి, శాసనసభా పక్ష నాయకత్వ బాధ్యతను పార్టీ సీనియర్ నేత జీటీ దేవేగౌడ లేదా శ్రీనివాసపూర్ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డికి కట్టబెట్టేవచ్చని పార్టీ వర్గాల సమాచారం.

నాయకత్వ బదిలీకి సంకేతం..

కేంద్ర మంత్రి హోదాలో హెచ్‌డి కుమారస్వామి తొలిసారి కర్నాటకకు వచ్చాక.. నిఖిల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు గురించి ఆయన వివరించారు. మీడియా సమావేశానికి పార్టీ సీనియర్లు హాజరుకాకపోవడం నాయకత్వ బదిలీకి సంకేతంగా భావించాలి.

పార్టీ విస్తరణ గురించి..

కర్ణాటకలో పార్టీ విస్తరించాలంటే గౌడలు, వొక్కలిగలు కాకుండా ఇతర వర్గాల నేతలను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని జెడి(ఎస్) వర్గాలు అంగీకరించాయి. జేడీ(ఎస్) పోటీ చేసిన మూడు లోక్‌సభ స్థానాల్లో రెండు స్థానాల్లో గెలుపొందడం, హెచ్‌డి కుమారస్వామి కేంద్ర మంత్రి కావడం స్థానిక నాయకులకు, పార్టీ కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపింది.

ప్రజ్వల్ వ్యవహారంతో..

1990వ దశకంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని గౌడ కుటుంబం పార్టీ వ్యవహారాలను చూసుకుంటుంది. పార్టీపరంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. అయితే ప్రజ్వల వ్యవహారం పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చి పెట్టింది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకోవాలని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో భాగంగా పోటీ చేయాలని పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయం కూడా పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన కలిగించే విషయంగా చూడాలి.

నాయకత్వం మూడో తరాలికి బదిలీ..

కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉంటూ పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవచ్చు. పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ బాధ్యతలను నిఖిల్ కుమారస్వామికి అప్పగించే అవకాశాలున్నాయి. మొత్తం మీద పార్టీ నాయకత్వం గౌడ కుటుంబంలోని మూడో తరానికి బదిలీ అయినట్టే.

Tags:    

Similar News