సత్యమేవ జయతే - సిద్ధరామయ్యకు జేడీఎస్ ఎమ్మెల్యే సపోర్ట్

‘‘నేనే ఏ తప్పు చేయలేదు. చేసి ఉంటే నేను ఇంత కాలం రాజకీయాల్లో ఉండడం సాధ్యం కాదు. చాముండేశ్వరి దేవి, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరు’’ - కర్ణాటక సీఎం

Update: 2024-10-03 12:00 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎప్పటికీ సత్యమే గెలుస్తుందన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందన్నారు. ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణం కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బీజేపీ, జేడీ(ఎస్) పదేపదే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దసరా ఉత్సవాలను ప్రారంభించిన సీఎం..

చాముండేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో పది రోజుల దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వరుణ నియోజకవర్గం నుంచి మూడుసార్లు, బాదామి నుంచి ఒకసారి, చాముండేశ్వరి నుంచి ఐదుసార్లు గెలిచాను. చాముండేశ్వరి, ప్రజల ఆశీర్వాదం వల్లే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాను. 2013 నుంచి 2018 వరకు సీఎంగా పనిచేశా. మంత్రి అయ్యి 40 ఏళ్లు దాటింది. 1984 ఆగస్టు 17న తొలిసారి మంత్రి అయ్యాను. బహుశా కర్ణాటక చరిత్రలో దేవరాజ్ ఉర్స్ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అంటే అది సిద్ధరామయ్య మాత్రమే'. నేనే ఏ తప్పు చేయలేదు. ఏదైనా తప్పు చేసి ఉంటే.. నేను ఇంత కాలం రాజకీయాల్లో ఉండడం సాధ్యం కాదు. చాముండేశ్వరి దేవీ, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు’’ అని అన్నారు.

సిద్ధరామయ్యను సమర్ధించిన దేవెగౌడ..

దసరా ప్రారంభోత్సవ వేడుకలకు జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రితో ఆయన వేదిక పంచుకున్న ఆయన.. సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు.

కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి నుద్దేశించి జీటీ దేవెగౌడ మాట్లాడుతూ..కేంద్రంలో మంత్రి అయ్యాక కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సిద్దరామయ్య చేసిన మంచి పనులను పక్కనపెట్టి, రోజూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం మంచిది కాదన్నారు.

అలాగయితే ఎవరూ మిగలరు..

‘‘లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా నుంచి రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచిన కుమారస్వామి రాజీనామా చేయమని అడిగితే రాజీనామా చేస్తారా? సిద్ధరామయ్య 136 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గెలిచి సీఎం అయ్యారు. ఆయనను రాజీనామా చేయమని అడుగుతున్నారు. రాజీనామా చేయమని ఏ చట్టం చెబుతుంది? కోర్టు అడిగిందా లేక గవర్నర్ అడిగారా? ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే రాజీనాయా చేయాల్సి వస్తే.. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీ(ఎస్‌)లో ఎవరూ మిగలరు. నేను సవాల్ చేస్తున్నా..కేసులు నమోదయిన ప్రజాప్రతినిధులంతా దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేయమనండి. కోర్టులు ఉన్నాయి. జడ్జీలు ఉన్నారు. తీర్పుకు కట్టుబడి ఉందాం. ముందు అభివృద్ధి గురించి ఆలోచించండి.. కేంద్రం నుంచి ఏం తేవాలి. రాష్ట్రానికి ఏమి చేయాలి అన్న విషయాలపై దృష్టి పెట్టండి” అని ప్రతిపక్షాలకు చురకలంటించారు.

ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మల్లికార్జున స్వామి భూమిని కొనుగోలు చేసి పార్వతికి బహుమతిగా ఇచ్చిన సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి బీఎం, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు తదితరులపై సెప్టెంబర్ 27న లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు దర్యా్ప్తు చేపడుతోంది.

Tags:    

Similar News