దేవేగౌడ మనవడిని సస్పెండ్ చేసిన జేడీ(ఎస్), కారణం ఏంటంటే..

మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియోలు బయటకు రావడంతో జేడీ(ఎస్) ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు.

Update: 2024-04-30 11:09 GMT

అనేకమంది మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియోలు బయటకు రావడంతో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మనవడు, హసన్ ఎంపీ, ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనతాదళ్( సెక్యూలర్) ప్రకటించింది. ఏప్రిల్ 26న కర్నాటకలో మొదటి దశ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ వీడియోలు ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ అయ్యాయి.

ఓ వీడియోలో స్వయంగా ప్రజ్వల్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో బ్లాక్ మెయిల్ చేస్తానని ఓ మహిళతో చెబుతున్నమాటలు ఉన్నాయి. రేవణ్ణ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 నుంచి 2022 మధ్య కాలంలో తనపై పలుమార్లు లైంగిక వేధింపులు జరిగాయని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. హెచ్‌డీ రేవణ్ణ తన భార్య ఇంట్లో లేని సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఆరోపణలు ఖండించిన ప్రజ్వల్
అయితే తనపై వచ్చిన ఆరోపణలను ప్రజ్వల్ రేవణ్ణ ఖండించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో తనను ఇందులో ఇరికిస్తున్నారని అన్నారు. కర్నాటక ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరాడు. అయితే దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడానికి కంటే ముందే ప్రజ్వల్ దేశాన్ని వీడాడు. ఆయన జర్మనీ వెళ్లినట్లు సమాచారం.
ప్రజ్వల్‌ను భారత్‌కు తిరిగి రావాల్సిందిగా కోరతామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. మహిళలతో ప్రజ్వల్ రేవణ్ణ మాట్లాడినట్లు చెబుతున్న 2, 976 అసభ్యకర వీడియోలతో ఉన్న పెన్ డ్రైవ్ తనకు చేరిందని బీజేపీ దేవరాజే గౌడ పేర్కొన్నారు.
జాతీయ మహిళ కమిషన్..
మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) కర్ణాటక పోలీసులను మూడు రోజుల్లోగా నివేదిక కోరింది. కర్నాటక డీజీపీకి రాసిన లేఖలో, రేవణ్ణ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
దేశం విడిచిపారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సింది పోలీసులను కమిషన్ కోరింది. "కమిషన్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి దారుణాలు జరిగినందుకు తీవ్రంగా కలత చెందుతోంది" అని లేఖలో జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు సమాజంలో మహిళలపై హింసా ప్రవృత్తిని ప్రొత్సహిస్తాయని ఆందోళ చెందింది. పోలీసులు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని కోరింది.
Tags:    

Similar News