కొబ్బరిలో కేరళను వెనక్కి నెట్టిన కర్ణాటక, తమిళనాడు
వారాంతపు వ్యవసాయంతో దిగుబడి పెరిగినట్లు వెల్లడి;
By : The Federal
Update: 2025-01-30 11:46 GMT
కొబ్బరి అనగానే.. మనకు టక్కును గుర్తుకు వచ్చేది కేరళనే.. రాష్ట్రం సముద్రం పక్కన ఉండటంతో అక్కడ కొబ్బరి, రబ్బర్ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలలు కావడంతో చాలామంది రైతులు కొబ్బరి సాగుకే మొగ్గుచూపుతుంటారు. వంటల్లో కూడా కొబ్బరినే స్థానికులు ఎక్కువగా ఉపయోగిస్తారు.
దాదాపు దశాబ్ద కాలంగా అంటే 2016 నుంచి కొబ్బరి ఉత్పత్తిలో కేరళనే అగ్రగామిగా ఉంటోంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కొబ్బరి సాగులో కేరళను, పొరుగున ఉన్న కర్ణాటక అధిగమించింది. ప్రస్తుతం కొబ్బరి ఉత్పత్తిలో కర్ణాటక తరువాత రెండో స్థానంలో తమిళనాడు ఉండగా, మూడో స్థానానికి కేరళ పడిపోయింది.
కేంద్ర ఆధ్వర్యంలోని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(సీడీబీ) గణాంకాల ప్రకారం.. 2022-23 కర్ణాటక 595 కోట్ల కొబ్బరి కాయలను ఉత్పత్తి చేయగా, కేరళ 563 కోట్లుగా ఉంది. ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్త్రైమాసికాల్లో సీడీబీ తాత్కాలిక డేటా ప్రకారం.. కేరళ మరింత దిగజారిపోయిందని జాతీయ మీడియా వెల్లడించింది.
ఈ సమయంలో కన్నడ నాట 726 కోట్ల కొబ్బరికాయలు పండించగా, కేరళ 564 కోట్లు మాత్రమే సాధించింది. ఇదే సమయంలో తమిళనాడు 578 కోట్ల కాయలను ఉత్పత్తి చేసింది. దీనితో కేరళ మూడో స్థానానికి పడిపోయింది. దేశ కొబ్బరి ఉత్పత్తిలో ఇప్పుడు కర్ణాటక వాటా 28. 5 శాతంగా ఉంది.
వారాంతపు వ్యవసాయమే కారణమా?
కర్ణాటకలో కొబ్బరి ఉత్పత్తి పెరగడానికి వారాంతపు వ్యవసాయమే కారణమని సీడీబీ అధికారులు చెబుతున్న మాట. అక్కడ యువత ఎక్కువగా ఈ తరహ పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నగరాల్లో ఉద్యోగాలు చేయడానికి యువత వెళ్లడంతో కొబ్బరిసాగుకు ప్రాధాన్యం పెరిగింది.
యువత కేవలం సెలవు దినాల్లో మాత్రమే పంట చేలకు వస్తున్నారు. దీనికి పెద్దగా సంరక్షణ అవసరం పడకపోవడంతో కొబ్బరి పంట పెరగడానికి దారి తీసింది. అలాగే మెరుగైన యాజమన్య పద్దతులు అవలంభించడం కూడా ఉత్పత్తి పెరగడానికి ఓ కారణమని నిపుణులు అంటున్నారు.
కొబ్బరిని తుమకూరు, మాండ్య, హసన్ జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది కర్ణాటకలో సాగవుతున్న మొత్తం కొబ్బరిలో 80 శాతంగా ఉంది. యువ రైతులు నాణ్యమైన సాగు పద్దతులను పాటిస్తున్నారు. అలాగే హేసరఘట్టలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హర్టీకల్చర్ రీసెర్చ్ వంటి సంస్థల నుంచి అధునాతన వ్యవసాయ పద్దతులపై శిక్షణ తీసుకుంటున్నారు. ఇది దిగుబడి అనూహ్యాంగా పెరగడానికి కారణమైంది.
కేరళలో పడిపోయిన దిగుబడి..
ఇదిలా ఉంటే.. కేరళలోని కొబ్బరి ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాలుగా మందగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి సాగు విస్తీర్ణం 2000-01 నుంచి 2023-24 మధ్య కాలంలో 9. 25 లక్షల హెక్టార్ల నుంచి 7. 59 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
అదే సమయంలో కర్ణాటకలో సాగు విస్తీర్ణం 3.33 లక్షల హెక్టార్ల నుంచి 7. 33 లక్షల హెక్టార్లకు విస్తరించింది. అంతేకాకుండా పంటల నిర్వహణ, పర్యాటకంతో గొడవలు కూడా ఉత్పత్తి తగ్గడానికి కారణమైంది. అలాగే కొప్రాబాల్ ఉత్పత్తిలో కూడా కర్ణాటక కేరళ కంటే ముందుంది.