బెంగళూర్ సౌత్ లో గెలుపెవరిదో.. హోరాహోరీ పోరులో కాంగ్రెస్, కమలం
1989 తరువాత కాంగ్రెస్ ఇక్కడి నుంచి గెలవలేదు. ఎనిమిదిసార్లు బీజేపీ జయకేతనం ఎగరవేసింది. తొమ్మిదోసారి కూడా గెలుపు మాదే అనే ధీమాతో ఉంది. ఆ స్థానమే బెంగళూర్ సౌత్..
By : Muralidhara Khajane
Update: 2024-04-23 07:29 GMT
కర్నాటకలో రెండో దశ ఎన్నికలు జరగడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కీలకమైన బెంగళూర్ దక్షిణ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. పార్టీలన్నీ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రజలు మోదీ గ్యారెంటీలకు ఓటు వేస్తారా? లేదా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ఐదు గ్యారెంటీల వైపు మొగ్గుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్, బీజేపీ-జేడీ(ఎస్) కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు సమావేశాలు, రోడ్‌షోలు, యానిమేషన్ చర్చలు, పార్కుల్లో ఉదయాన్నే నడిచేవారితో మాట్లాడడం, హోటళ్లలో కాఫీ తాగేవారితో చర్చలు.. ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఫైర్‌బ్రాండ్ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి మధ్య హోరాహోరీ పోరు, ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది.
కఠినమైన సవాలు
మాజీ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె అయిన 41 ఏళ్ల సౌమ్యా రెడ్డి, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ మళ్లీ ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగి తన అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థి సూర్యకు గట్టి సవాల్ విసురుతోందని రాజకీయా పరిశీలకులు భావిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సూర్యపెట్టింది పేరు. అయినప్పటికీ మోదీ వేవ్ తో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
బెంగళూర్ సౌత్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది, ఇది 1991 నుంచి బిజెపికి కంచుకోట. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఐదు స్థానాలు, కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకున్నాయి. నిజానికి 1977 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఆర్ గుండూరావు 1989 ఎన్నికల్లో ఇక్కడ నుంచి చివరిగా కాంగ్రెస్ పార్టీ జెండా పై గెలిచారు.
తేజస్వి సూర్య ఎదుగుదల
బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య వాక్చాతుర్యంతో పేరు తెచ్చుకున్నారు. భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్న 33 ఏళ్ల సూర్య, తన నియోజకవర్గంలో ఎక్కువగా ఆర్‌ఎస్‌ఎస్, 'సంఘ్ పరివార్'తో అనుబంధం ఉన్న రైట్‌వింగ్ మేధావుల తో చర్చలు జరుపుతుంటారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా సూర్య, 28 ఏళ్ల వయసులో తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు.
బెంగళూరు సౌత్‌కు ప్రాతినిధ్యం వహించిన అనంతకుమార్ ఆకస్మికంగా మరణించడంతో సూర్య ఆ స్థానంలో నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. కర్ణాటకలో బీజేపీ అట్టడుగు స్థాయి నుంచి నిర్మించిన నాయకుల్లో అనంతకుమార్ ఒకరు. క్షేత్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుని, సామాజిక సేవతో ఇంటింటా పేరు తెచ్చుకున్న అనంత్‌కుమార్ భార్య తేజస్వినికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు.
సంఘ్ పరివార్ మద్దతు, మోదీ చరిష్మాతో సూర్య విజయం సాధించారు. 2019లో 3.3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ కురువృద్ధుడు బికె హరిప్రసాద్‌ను ఓడించి లోక్‌సభలో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో తాను నియోజకవర్గంలో చేసిన పనులు చెప్పుకుని ఓట్లు అడగాల్సిన సమయం వచ్చింది. అయితే గురు రాఘవేంద్ర కో ఆపరేటిక్ బ్యాంక్ కుంభకోణం, మెట్రో విస్తరణ ఇతర ప్రాజెక్ట్ లో జాప్యం వంటి ఆరోపణలను సూర్య ఎదుర్కొన్నారు.
సౌమ్యారెడ్డి ఆత్మీయ..
ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యారెడ్డి ప్రస్తుతం ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆమె 2018 నుంచి 2023 వరకు కర్ణాటక శాసనసభలో జయనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆమె తండ్రి రాజకీయంగా ధురంధరుడు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఆమె తండ్రి రామలింగారెడ్డి శక్తివంతమైన కాంగ్రెస్ నాయకుడు. ఆయనను ఎదిరించే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా లేడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాంకేతిక కారణాల వల్ల సౌమ్యారెడ్డి కేవలం 19 ఓట్ల తేడాతో ఓడిపోయారని కాంగ్రెస్‌లోని పలువురు భావిస్తున్నారు.
విధానసభ ఎన్నికల్లో నా కూతురు దాదాపు విజయం సాధించిందని.. కానీ తిరస్కరణకు గురైన ఓట్ల లెక్కింపు ఆమెకు వ్యతిరేకంగా పని చేసిందని, ఈ వివాదం ఇప్పుడు కోర్టుకు చేరిందని, దాని గురించి పెద్దగా మాట్లాడలేనని మంత్రి రామలింగారెడ్డి అన్నారు. 'ప్రజాస్వామ్యాన్ని, దేశ సామాజిక స్వరూపాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు' సౌమ్య ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కాంగ్రెస్ హామీలను కూడా ఆమె ప్రచారం చేస్తున్నారు. ఆమె దృష్టిలో, నియోజకవర్గంలోని ఓటర్లు మార్పు కోసం చూస్తున్నారు. ప్రస్తుతం కనిపించని ఎంపీపై అసంతృప్తితో ఉన్నారు.
లోక్‌సభ స్పీకర్ జస్టిస్ కెఎస్ హెగ్డే, టిఆర్ షామన్న, విఎస్ కృష్ణయ్య, ఆర్ గుండూరావు, ప్రముఖ ఆర్థికవేత్త వెంటకగిరిగౌడ్, కేంద్రంలోని ప్రభావవంతమైన మంత్రి అనంత్‌కుమార్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంత్ కుమార్ వరుసగా ఆరుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 23,41,759.గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 53.7 శాతం ఓటింగ్ నమోదైంది.
సూర్య vs సౌమ్య
సూర్య 'అభివృద్ధి, మోదీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. జయనగర్ నుంచి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సౌమ్య ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వ హామీ పథకాలపై ఓట్లు అడుగుతున్నారు. అయితే ఈ నియోజకవర్గం విశిష్టత ఏంటంటే.. గత ఎనిమిది ఎన్నికల్లో బీజేపీ వైపే మొగ్గు చూపింది.
ఈ నియోజకవర్గంలో తొమ్మిదోసారి గెలుస్తాం’’ అని జయనగర్ ఎమ్మెల్యే కేసీ రామమూర్తి ధీమాగా చెప్పారు. అయితే కొందరు ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. ప్రజల కష్టాలు సూర్య వినడం లేదని బసవనగుడి వాసి నాగరాజరావు ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్యకి కూడా సవాళ్లు చాలా ఉన్నాయి. ఆఖరి నిమిషంలో అభ్యర్థిగా ఎంపికైన ఆమె.. ఎప్పుడూ బీజేపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గానికి నామినేషన్ వేశారు.
2019 ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్‌పై సూర్య 3,31,192 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. సూర్యకు 7,39,229 ఓట్లు రాగా, బీకే హరిప్రసాద్‌కు 4,08,037 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఆశీర్వదిస్తే సౌమ్య డబుల్ రికార్డు సృష్టిస్తుందని ఆమె తండ్రి రామలింగారెడ్డి అన్నారు.
"మొదట నియోజకవర్గంలో బిజెపి ఆధిపత్యాన్ని అంతం చేయడం, తొమ్మిదోసారి గెలవకుండా నిరోధించడం. రెండవది, ఆమె బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళ అవుతుంది" అని ఆయన అంటున్నారు. గత 73 ఏళ్లలో జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా ఎన్నిక కాకపోవడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత.
ఎన్నికల వాగ్దానాలు
తాను ఎంపీగా ఎన్నికైతే బెంగుళూరు సౌత్ నియోజకవర్గంలో అమలయ్యే పథకాల గ్రీన్ మ్యాప్ సిద్ధం చేశానని సౌమ్య హామీ ఇచ్చారు. నేను ఎంపీని అయితే బెంగళూరు ఉద్యానవన నగరమని నిరూపిస్తానని.. పచ్చని బెంగళూరు సౌత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని.. ఈ నియోజకవర్గంలో గెలుపొందాలనే ఆశ నాకు ఉందని ఆమె అన్నారు.
ఇదిలావుండగా, తనపై అధికార వ్యతిరేకత ప్రభావం లేదని తేల్చిచెప్పిన తేజస్వి సూర్య, పెండింగ్‌లో ఉన్న మెట్రో రెండో దశ, 2ఎ, 2బిలకు అనుమతులు పొందడం, సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయడం రింగ్‌రోడ్డును ఖరారు చేయడం వంటివి చేస్తానని హామీ ఇచ్చారు.