కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామాపై హై డ్రామా
వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో నిధుల మళ్లింపునకు సంబంధించి కర్ణాటక మంత్రి నాగేంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో నిధుల మళ్లింపునకు సంబంధించి కర్ణాటక మంత్రి నాగేంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను ఈనెల 6 లోపు బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన నేపథ్యంలో తాను తన పదవికి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పారు నాగేంద్ర. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అన్ని విషయాలు మీడియాతో మాట్లాడతానన్నారు.
సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సూచన మేరకు నాగేంద్ర తన రాజీనామాను సమర్పించినట్లు వార్తలొచ్చాయి. అయితే నాగేంద్ర రాజీనామాను సమర్పించలేదని డికె శివకుమార్ స్వయంగా చెప్పారు.
అసలు ఏం జరిగింది?
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ (KMSDSC) సూపరింటెండెంట్ పి చంద్రశేఖర్ (48) మే 28న తన స్వస్థలం శివమొగ్గలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి డెత్‌నోట్ ఆధారంగా ముగ్గురు సహోద్యోగులను సస్పెండ్ చేశారు. అదే నోట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సుసైడ్ ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
సూసైడ్ నోట్‌లో ఏముంది?
కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.187 కోట్ల నుంచి రూ.80 నుంచి 85 కోట్లు దారి మళ్లిన విషయాన్ని చంద్రశేఖర్ తన ఆరు పేజీల సూసైడ్ నోట్‌లో వివరించారు. మంత్రి కార్యాలయం, ఎండీ పద్మనాభం, అకౌంట్స్ మేనేజర్ పరశురాం దుర్గన్న సహా కీలక అధికారుల పాత్రను అందులో రాశారు. అవినీతి అధికారులపై చర్య తీసుకోవాలని నోట్‌లో చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.