‘ అదే నా లక్ష్యం.. అందాకా నిష్క్రమించను..’
మీడియా సమావేశంలో బీజేపీ కేరళ చీఫ్ రాజీవ్ రామచంద్రన్..;
కేరళ(Kerala)లో బీజేపీ(BJP)ని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, ఆ లక్ష్యం నెరవేర్చిన తర్వాతే తాను రాష్ట్రం నుంచి వెళ్తానని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) తెలిపారు. కేరళ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తిరువనంతపురంలో విలేఖరులతో మాట్లాడారు.
"కేరళలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రస్తుతమున్న 19 ఓట్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ వెనకబడటానికి సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంటే (UDF) కారణమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందాయని ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే బీజేపీ పాలనతోనే సాధ్యమని చెప్పారు. ‘‘మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చింది. అలాంటి అభివృద్ధిని కేరళలో కూడా తీసుకురావాలనుకుంటున్నాం," అని ఆయన పేర్కొన్నారు.
2024 లో తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. అయినా కూడా 3.5 లక్షల పైచిలుకు ఓట్లు సాధించగలిగానని గుర్తు చేశారు.
చంద్రశేఖర్ గురించి క్లుప్తంగా..
రాజీవ్ చంద్రశేఖర్ కర్ణాటక నుంచి మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. రాజీవ్ కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదని, ఆయనకు వ్యాపారం, మీడియా, టెక్నాలజీ రంగాల్లో మంచి అనుభవం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
అసెంబ్లీ ఎన్నికలే అసలు పరీక్ష..
2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు చంద్రశేఖర్ నాయకత్వానికి అసలు అగ్ని పరీక్ష. కేరళలో బీజేపీ దీర్ఘకాలంగా ఆశిస్తున్న బ్రేక్‌థ్రూ చంద్రశేఖర్ వల్ల సాధ్యమవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.