‘దసరా తర్వాత కీలక రాజకీయ పరిణామాలు’
‘ముడా స్కామ్ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుతో సహా రాబోయే రోజుల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర.
ముడా స్కామ్ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుతో సహా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వేగవంతమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర గురువారం పేర్కొన్నారు.
"రాష్ట్రంలో కొద్ది రోజుల్లో వేగవంతమైన రాజకీయ పరిణామాలు జరుగుతాయి. మీరు (మీడియా) రాష్ట్ర ప్రజలు వాటిని చూస్తారు" అని ఆయన విలేఖరులతో అన్నారు. దసరా పండుగ తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తమకున్న సమాచారం ప్రకారం..ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) స్థలం కేటాయింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దసరా తర్వాత రాజీనామా చేయవచ్చని విజయేంద్ర చెప్పారు. నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ సిద్ధరామయ్య కేబినెట్‌లోని కొందరు మంత్రులు ఇటీవల సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
విజయేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా బీజేపీలోని కొందరు నాయకులు వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఆయన మాట్లాడుతూ.. సీనియర్లు ఉన్నా, పార్టీని నడిపించే బాధ్యత నాకు అప్పగించారు. పార్టీలోని సీనియర్లు నన్ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలి.’’ అని చెప్పారు.
సీనియర్ శాసనసభ్యులు బసనగౌడ పాటిల్ యత్నాల్, రమేష్ జార్కిహోళి నేతృత్వంలోని బీజేపీ నాయకులు విజయేంద్రను బహిరంగంగా విమర్శించారు. అధికార కాంగ్రెస్‌తో "సర్దుబాటు రాజకీయాలు" చేస్తున్నాడని వారు ఇటీవల ఆరోపించారు. విజయేంద్ర తండ్రి సీనియర్ పార్టీ నాయకుడు బీఎస్ యడియూరప్ప పార్టీని తన కబంధ హస్తాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా విమర్శించారు.