వయనాడ్‌కు కేంద్రం సాయం..ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
"ఇది వాస్తవానికి 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా ఇచ్చిన రుణం. ఒక రకంగా అది గ్రాంటే. విమర్శలు మాని పునరావాస పనులను ప్రారంభించండి, ’’ - కే. సురేంద్రన్;
వయనాడ్ పునరావాసానికి కేంద్రం రూ. 529.50 కోట్ల షరతులతో కూడిన రుణాన్ని మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ అంశం కేరళ రాజకీయాలలో దుమారం రేపుతోంది. అధికార ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ ఈ షరతును తీవ్రంగా విమర్శించగా..బీజేపీ గ్రాంట్‌గా పేర్కొంటుంది.
కేరళలోని ఎల్‌డీఎఫ్(LDF) ప్రభుత్వంతో పాటు యూడీఎఫ్(UDF)ను తీవ్రంగా విమర్శించిన బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ (K Surendran).. "ఇది వాస్తవానికి 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా ఇచ్చిన రుణం. ఒక రకంగా అది గ్రాంటే. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఐదేళ్ల తర్వాత జాతీయ పార్టీ (బీజేపీ)పై పడుతుంది. కాబట్టి పినరాయి విజయన్ ప్రభుత్వం, యూడీఎఫ్ దాన్ని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజకీయ విమర్శలు చేయకుండా, వెంటనే పునరావాస పనులను ప్రారంభించాలి" అని తిరువనంతపురంలో మీడియాతో అన్నారు. అలాగే గడువు (మార్చి 31)ను పొడిగించాలని కేంద్రాన్ని అడగవచ్చని చెప్పారు. ఏప్రిల్ లేదా మే వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించే అవకాశం ఉంది" అని చెప్పారు.
మంత్రి బాలగోపాల్ ఏమన్నారు?
ఈ భారీ మొత్తాన్ని తక్కువ వ్యవధిలో వినియోగించడం ఎంతటి సమస్యో కేంద్రానికి వివరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. ‘‘విపత్తుల సమయంలో సాధారణంగా రాష్ట్రాలకు గ్రాంట్‌లు ఇచ్చే పద్ధతి ఉన్నా.. ఇప్పటి వరకు మనకు ఎలాంటి సాయం అందలేదు. ఇప్పుడిస్తున్న రుణం కూడా చాలా ఆలస్యంగా ఇచ్చారు,’’ అని పేర్కొన్నారు.
సతీశన్ మద్దతు..
బాలగోపాల్(Balagopal) అభిప్రాయానికి కాంగ్రెస్ ప్రతిపక్షనేత వి.డి. సతీశన్ (V D Satheesan) మద్దతు తెలిపారు. మార్చి 31లోపు పూర్తి రుణాన్ని వినియోగించాలన్న షరతు "అసాధ్యం" అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో సతీశన్ ఇలా పోస్టు చేశారు. "వయనాడ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయి, జీవనోపాధి దెబ్బతిని అతికష్టంగా బతుకీడుస్తున్న సమయంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వకుండా, రుణాన్ని మంజూరు చేయడం బాధితులను హేళన చేయడమే" అని విమర్శించారు.