‘ఈడీ సోదాలను ఆపేయాలి’
హైకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం, TASMAC..;

మద్రాస్ హైకోర్టు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విక్రయ సంస్థ (TASMAC - Tamil Nadu State Marketing Corporation) కార్యాలయాల్లో తదుపరి తనిఖీలు చేయొద్దని సూచించింది. TASMAC సిబ్బందిని 60 గంటలకు పైగా అక్రమంగా నిర్బంధించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తమ దర్యాప్తునకు ఆధారమైన FIR, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) కాపీలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నెల ప్రారంభంలో TASMAC కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ.. సుమారు రూ. వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది.
TASMAC పిటిషన్..
ఈడీ తనిఖీలను వ్యతిరేకిస్తూ TASMAC, తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు ఎం.ఎస్. రమేశ్, ఎన్.సెంతిల్కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. దర్యాప్తు పేరుతో తమ ఉద్యోగులను వేధించకుండా చూడాలని, రాష్ట్ర పరిధిలో ఈడీ విచారణ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని TASMAC తన పిటిషన్‌లో కోర్టును కోరింది.
తనిఖీకి అనుమతి తీసుకోలేదు
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ జోక్యం కుదరదని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (AG) పి.ఎస్. రామన్ కోర్టుకు తెలిపారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం కావడంతో పిటిషన్‌లో మార్పులు చేసేందుకు అడ్వొకేట్ జనరల్ కొంత సమయం కోరారు.
"కేంద్ర దర్యాప్తు సంస్థ తన చర్యల్లో పారదర్శకత పాటించాలి. విచారణ తీరు వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించేలా ఉన్నాయి. అనుమతి లేకుండా కార్యాలయాల్లోకి ప్రవేశించి, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదు" అని TASMAC తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు వివరించారు.
తనిఖీ సమయంలో ఈడీ మహిళా ఉద్యోగులు సహా ఎవ్వరినీ బయటికి వెళ్లనివ్వలేదని కోర్టుకు విన్నవించారు. అయితే ఈ ఆరోపణలను అదనపు సోలిసిటర్ జనరల్ (ASG) ఏ.ఆర్.ఎల్. సుందరేశన్ ఖండించారు. TASMAC లో అక్రమ లావాదేవీలు జరిగాయని నిర్ధారణ అయిన తర్వాతే ఈడీ తనిఖీలు మొదలుపెట్టిందని వాదించారు.
"TASMAC టెండర్ల ప్రక్రియలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఆధారాలున్నాయని, సుమారు రూ.వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ చెబుతోంది. మార్చి 6న జరిగిన తనిఖీల్లో ఈ అవకతవకలకు సంబంధించి ఆధారాలు కూడా లభించాయని ఈడీ పేర్కొంది.