మెట్రో చార్జీల పెంపు మా చేతుల్లో లేదు: సిద్ధరామయ్య
కేంద్ర, రాష్ట్రాలకు సమాన వాటా ఉందన్న కాంగ్రెస్ సర్కార్;
By : The Federal
Update: 2025-02-12 13:26 GMT
బెంగళూర్ మెట్రో చార్జీల పెంపుపై కర్ణాటకలో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. టికెట్ రేట్ల పెంపుపై బీజేపీ వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వగా, అధికార కాంగ్రెస్ వీటిపై విమర్శలు గుప్పిస్తోంది. విపక్షాలు తప్పుడు, ప్రజలను భయపెట్టే విధంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని’’ ఆరోపిస్తుంది.
‘‘ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించే , వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంది. ఇది వారి రాజ్యాంగ హక్కు, నేను దానిని గౌరవిస్తాను’’ అని సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో సిద్దరామయ్య అన్నారు.
బీజేపీ అబద్దాలు వ్యాప్తి చేస్తోంది..
ప్రతిపక్ష బీజేపీ పై సీఎం నేరుగా విమర్శలు గుప్పించారు. రాజకీయ లాభం కోసం ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని, తప్పుడూ సమాచారంతో ప్రజలల్లో ఆగ్రహాన్ని,వ్యతిరేకతను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బెంగళూర్ మెట్రో విస్తరణను కేంద్రం సాధించిన ఘనతగా ప్రకటించుకున్న పార్టీ అదే నాయకులు ఇప్పుడు ఛార్జీల పెంపుపై ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పుడూ కర్ణాటక ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇది ఆ పార్టీ చేస్తున్న ద్వంద్వ ఆరోపణలని స్వీయం మోసం, వంచన తప్ప మరొకటి కాదన్నారు.
బెంగళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాల మధ్య సమాన భాగస్వామ్యంతో కూడిన జాయింట్ వెంచర్ అని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
‘‘బీఎంఆర్సీఎల్ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, అంటే కర్ణాటక ప్రభుత్వానికి దాని నిర్ణయాలపై పూర్తి నియంత్రణ ఉండదు. దేశంలోని అన్ని ఇతర మెట్రో కార్పొరేషన్ల మాదిరిగానే బీఎంఆర్సీఎల్ కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రించే మెట్రో రైల్వేస్(ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) చట్టం-2002 ప్రకారం పని చేస్తుంది’’ అని ఆయన అన్నారు.
2017 నుంచి ఇవే చార్జీలు..
మెట్రో చార్జీలు దాదాపుగా 2017 నుంచి అలాగే ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. బీఎంఆర్సీఎల్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి సవరణ కోరుతూ లేఖ రాసింది. ‘‘ కర్ణాటక ప్రభుత్వానికి చార్జీలను నిర్ణయించే అధికారం ఉంటే.. బీఎంఆర్సీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి బదులుగా కేంద్రానికి ఎందుకు లేఖ రాసింది’’ అని ప్రశ్నించారు.
బీఎంఆర్సీఎల్ లేఖకు ప్రతిస్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. తరణి( రిటైర్డ్) నేతృత్వంలోని ఛార్జీల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 16న వివరణాత్మక చర్చలు, అంచనాల తరువాత కమిటీ తన తుది నివేదికను సమర్పించింది.
‘‘ఢిల్లీ మెట్రో మినహ మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభ దశ చార్జీలను సంబంధిత రాష్ట్ర మెట్రో కార్పొరేషన్లు నిర్ణయించాయి. అయితే ఇప్పుడు ఛార్జీల సవరణలను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయిస్తుంది.
మెట్రో రైల్వేస్ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం.. మెట్రో కార్పొరేషన్ల ఈ కమిటీ చేసిన ఛార్జీల సిఫార్సులను అమలు చేయడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉంటాయి’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.